అరాచకాలు, అక్రమాలే అర్హతలుగా వైసీపీ అభ్యర్థుల ఎంపిక- రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఇలాంటి వారే Criminal Cases on YSRCP MLA Candidates: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి శనివారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తూ నాలుగు సవాళ్లను ఉటంకించారు. కండబలం, ధనబలం ఈ ఎన్నికల్లో ప్రధాన సవాళ్లని వాటిని ఎదుర్కొంటూ సక్రమంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బృహత్తర బాధ్యత ఉందని ప్రస్తావించారు. దురదృష్టవశాత్తు అధికార వైసీపీ అలాంటి అరాచక శక్తులనే మల్లీ ఈ ఎన్నికల్లో నిలిపింది. రాష్ట్రంలో 175 శాసనసభ, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ శనివారం ప్రకటించింది.
భూదందాలు, ఇసుక, మైనింగ్ దోపిడీ, రౌడీయిజం:175 మంది అభ్యర్థుల్లో అత్యధికులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. అందులో అడ్డగోలుగా దోపిడీ చేస్తూ అరాచకశక్తులుగా విశ్వరూపం దాల్చినవారు దాదాపు 50 మంది ఉన్నారు. భూదందాలు, ఇసుక, మైనింగ్ దోపిడీ, రౌడీయిజంతో ఇప్పటికే ప్రజలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించారు. ఈ అక్రమ యోధులకే మళ్లీ అభ్యర్థిత్వాలు కట్టబెట్టడం శోచనీయం. వీరిలో కొందరు అవే నియోజకవర్గాల నుంచి మరోసారి పోటీ చేస్తుంటే మరికొందరు కొత్త స్థానాలకు మారి ఏదోలా గెలవడానికి సామ, దాన, భేద, దండోపాయాలకు సిద్ధపడుతున్నారు.
చిత్తూరు జిల్లాలో అంతా ఆయనే : ప్రభుత్వంలో పెద్దాయనగా పేరు గాంచి, నంబరు 2గా చెలాయిస్తున్న ఆ నాయకుడు చేయని అరాచకాలు లేవు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అదే స్థానం నుంచి ఆయనకు మళ్లీ టికెట్ దక్కింది. ఏకంగా ఆరు నియోజకవర్గాలకు కింగ్‌గా వ్యవహరిస్తుంటారీయన. తండ్రి పేరుతో అక్కడ తిరిగే టిప్పర్లు సహజ వనరులను దోచేస్తుంటాయి. తన సామ్రాజ్యంలోకి వేరే పార్టీ అధినేతను సైతం అడుగుపెట్టనీయకుండా పోలీసుల అండతో దందా సాగించారు.
జగన్ మాటల్లోనే 'నా' చేతల్లో 'నో'- సొంత సామాజికవర్గానికే మరోసారి పెద్దపీట
పల్నాడు ప్రాంతంలోని ఓ నియోజకవర్గంలో నాయకుడి అరాచకాలకు అంతే లేదు. పట్టపగలే రాజకీయ ప్రత్యర్థుల గొంతులు కోస్తారు. విపక్ష పార్టీ జెండా పట్టుకుంటే వారి ఇళ్లు, దుకాణాలకు నిప్పుపెడతారు. ఆ ప్రాంతాన్ని ఆటవిక రాజ్యంగా మార్చేశారు. ఆయన తమ్ముడి ఆధ్వర్యంలోనే అక్రమ మద్యం వ్యాపారం సాగుతోంది. గ్రానైట్ లారీల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు పిండుకుంటారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సొంతిల్లు కూడా లేకుండా ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు వందల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆ ఘనుడికీ మళ్లీ వైసీపీ అభ్యర్థిత్వం దక్కింది.
కిందటి ఎన్నికల్లో బీద కబుర్లు చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను గడగడలాడించారు. పేదలకు ఇచ్చిన స్థలాలు లాక్కోవడం, ఎర్రమట్టి దందా సాగించడం, ఆఖరికి పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమైన వారి నుంచి కోట్ల రూపాయల కమీషన్లు కావాలంటూ బెదిరించి వారిని తరిమేసిన చరిత్ర ఈయనది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బియ్యం డాన్‌గా పేరు మోసిన నాయకుడు మళ్లీ అదే స్థానం నుంచి పోటీకి సిద్ధపడుతున్నారు. కొవిడ్ సమయంలో ప్రజలు చావుబతుకుల మధ్య అల్లాడుతుంటే ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేసిన ఫీజుల్లో వాటాలు తీసుకున్న ఘనుడీయన. ఉమ్మడి జిల్లా మెట్ట ప్రాంతంలోని వందల ఎకరాల్లో గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకున్నారు.
విశాఖలో రౌడీరాజుగా పేరు పొందారు. గంజాయి బ్యాచ్‌లను, కిరాయి నేరగాళ్లకు అండదండలు అందిస్తూ తనకు అనుకూలంగా మలుచుకోవడం ఈయన నైజం. ఒకప్పుడు ఎస్టీడీ బూత్ నడుపుతూ జీవితాన్ని ప్రారంభించిన ఈ నాయకుడు స్థిరాస్తి వ్యాపారంలో పాగా వేశాడు. విశాఖలోని ఒక నియోజకవర్గంలో ఏ నిర్మాణం చేపట్టాలన్నా ఈయనకు కప్పం కట్టాల్సిందే.
వైఎస్సార్సీపీ జాబితాలో ఫ్యామిలీ ప్యాకేజీలు - ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురికి అవకాశం
ఆయన సాక్షాత్తూ అధినేతకు దగ్గరి చుట్టం. కడప జిల్లాలో ఈయన అరాచకాలు అన్నీఇన్నీ కావు. కడప నగరంలోనే అనధికారిక వెంచర్లు ఎన్నో వేయించారు. 200 కోట్ల విలువైన 54 ఎకరాల భూమి లాగేసుకున్నారు. సర్వారాయ ప్రాజెక్టు సమీపంలో 400 ఎకరాలు ఆక్రమించి చేపల చెరువులు, పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. తన కుమారుడి పేరుతో సత్యసాయి జిల్లాలోని భూములకు ఎసరు పెట్టారు. ప్రభుత్వం చేపట్టే ఏ పనిలోనైనా గుత్తేదారులు 10 శాతం కమీషన్ ముట్టచెప్పాల్సిందే.
అధికార పార్టీలో కంకర కింకరుడిగా పేరు గాంచాడు మరో నాయకుడు. ఈయన నెల్లూరు జిల్లాలో ఒక స్థానాన్ని దక్కించుకున్నాడు. అక్కడ ఆయన ఆధ్వర్యంలోనే కబ్జాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నది ఇసుకలో సముద్రపు ఇసుక కలిపేసి అమ్ముకుంటున్నారు. జాతీయ రహదారికి పక్కనే గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో 25 ఎకరాల వరకు ఆక్రమించేశారు.
రాయలసీమలోని ఒక జిల్లాలో ఆమె మహిళా ప్రజాప్రతినిధి. జగనన్న కాలనీలకు భూములిస్తే పెద్ద మొత్తంలో పరిహారం ఇప్పిస్తామని చెప్పి రైతులతో మాట్లాడుకోవడం, వచ్చిన సొమ్ములో మూడో వంతు కమీషన్‌గా తీసుకునేలా ఒప్పందాలు చేసుకోవడం ఆమె ప్రత్యేకత. పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో వాటి కోసం రైతుల నుంచి తీసుకున్న భూములను వారికి తిరిగి అప్పగించాల్సింది పోయి, తానే లాక్కున్నారు. వాటిల్లో విలాసవంతమైన రిసార్టు నిర్మించుకుంటున్నారు.
'ప్రశ్నించే నాయకుడు ఏపీలో లేరు - ఉక్కు ప్రైవేటీకరణను తెలుగువాళ్లం అందరం కలిసి అడ్డుకుందాం'
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో టీడీఆర్ కుంభకోణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది మరొకరు. వందల కోట్లు ఇలా ఆర్జించి రాష్ట్రంలోనే పట్టణ పరిపాలన అధికారులను ముప్పుతిప్పలు పెట్టారు. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉంటూ చౌక బియ్యాన్ని తెలివిగా మళ్లించి కోట్లు వెనకేసుకున్నారు. ఇలా తాజాగా అధికార వైసీపీ టికెట్లు పొందిన వారి తెరవెనుక బాగోతాలు పరిశీలిస్తే ప్రజాస్వామ్యమే విస్తుపోవాల్సి వస్తుంది.
ఇక నేరిత్ర ఉన్నవాళ్లు, సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితులూ వైసీపీ అభ్యర్థులే. హత్య కేసులు ఉన్నవారు, ఎర్రచందనం స్మగ్లర్లకూ అవకాశాలిచ్చారు. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి, సీఎం జగన్‌పై 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసులున్నాయి. వీటన్నింటిలోనూ ఆయనే ప్రథమ ముద్దాయి. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం రవాణాకు సంబంధించి పలు స్టేషన్లలో గతంలో కేసులు నమోదయ్యాయి.
2014లో ఆయనపై పీడీ యాక్ట్ అమలు చేసి రాజమహేంద్రవరం జైలుకు పంపారు. అనంతపురం జిల్లా తాడిపత్రి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, సత్యసాయి జిల్లా ధర్మవరం అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రాప్తాడు అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై గతంలో హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి, ప్రస్తుత విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై గతంలో భూకబ్జా కేసు ఉంది. మంత్రి జోగి రమేశ్ గతంలో ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటిపై దాడి చేశారు. అందుకు బహుమానంగా అన్నట్లు ఆయనకు సీఎం జగన్ మంత్రి పదవి కట్టబెట్టారు. ఇప్పుడు పెనమలూరు నుంచి అభ్యర్థిగా నిలిపారు. విజయవాడ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ అనుయాయులు కొంతకాలం కిందట మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు.
నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిపై 11 సీబీఐ, 9 ఈడీ కేసులు ఉన్నాయి. సీఎంజగన్‌తో పాటు ఆయన అక్రమాస్తుల కేసులన్నింటిలోనూ విజయసాయిరెడ్డి ఎ-2గా ఉన్నారు. ఈయన కూడా బెయిల్‌పైనే ఉన్నారు. రాజంపేట లోక్‌సభ అభ్యర్థి మిథున్‌రెడ్డిపై రేణిగుంట విమానాశ్రయంలో సిబ్బందిపై దౌర్జన్యం కేసు ఉంది.