RRR COMMENTS ON CUSTODIAL TORTURE : చేసిన కర్మ ఎవర్నీ వదలదని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. తనను పుట్టినరోజు నాడు అన్యాయంగా అరెస్టుచేసి చిత్రహింసలు పెట్టి గుంటూరు జైలు, కోర్టుకు తరలించిన విజయ్‌పాల్ ఇప్పుడు అదే కోర్టు నుంచి నిందితునిగా జైలుకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు. కొంత సమయం ఆలస్యమైనా తనను చిత్రహింసలకు గురిచేసిన వారందరికీ శిక్ష పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాను ఇచ్చిన ఫిర్యాదులో ఏ4గా ఉన్న విజయ్‌పాల్ తనను అరెస్టు చేసినప్పటి నుంచి చిత్రహింసల వరకు మొత్తం సమన్వయం చేశారని తెలిపారు. పాపం పండిందని, తనను నిర్బంధించిన సమయంలో తనకున్న సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని సైతం బయటకు పంపారని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఓ మహిళా అధికారి వాళ్లను గది బయట కూడా ఉండకుండా హోటల్‌కు వెళ్లిపోవాలని సూచించారని వెల్లడించారు. ఒక ఐపీఎస్, ఒక ఏఎస్పీ ర్యాంకు అధికారి, సునీల్‌కుమార్‌తో పాటు అసలు కుట్రదారు సీతారామాంజనేయులు, ఆపై వ్యక్తుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదుచేశామన్నారు.
దయనీయమైన స్థితిలో విజయ్‌పాల్ - బిక్కుబిక్కుమంటూ జైలులో
ఏం రాజు గారూ ఇలా చేశారని అడిగారు: సునీల్‌నాయక్ అనే ఐపీఎస్ అధికారి బిహార్ క్యాడర్ నుంచి వచ్చి తిరిగి బిహార్‌కు వెళ్లిపోయారని తెలిపారు. రఘురామరెడ్డి అనే వ్యక్తి సైతం ఈ కుట్రలో ఉన్నారని అన్నారు. రెండురోజుల ముందు జరిగిన అంతర్గత చర్చల్లో ఆయన కూడా పాల్గొన్నారని, చంద్రబాబు సహా అందరినీ వేధించిన వ్యక్తి రఘురామరెడ్డి అనే విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. వీరందరూ చేసిన కుట్రను అమలుచేసిన కీలక నిందితుడు విజయ్‌పాల్ అని వెల్లడించారు. తన భద్రతా సిబ్బందిని బయటకు పంపించిన తరువాత అక్కడ ఉంచిన సత్యనారాయణ అనే సీఐ, మీరావలి అనే హెడ్ కానిస్టేబుల్‌ను కిందికి పిలిచి, అనంతరం ముసుగు వ్యక్తులను పంపించి తనను దారుణంగా కొట్టించారని రఘురామ తెలిపారు. ఆ ముసుగు వ్యక్తులు వెళ్లిపోయిన తర్వాత ఆ సీఐ, హెడ్‌కానిస్టేబుల్ తన గదిలోకి వచ్చి విరిగిపోయిన మంచాన్ని చూసి ఏమీ తెలియనట్లు ఏం రాజు గారూ ఇలా చెల్లాచెదురు చేశారని అడిగారన్నారు. కర్మ ఎవర్నీ వదిలిపెట్టదని రఘురామ అన్నారు.
గుండెపోటుతో మరణించేలా కుట్ర - విజయ్‌పాల్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
ఛాతీపై బరువైన వ్యక్తి కూర్చున్నారు: తనను పంపిన గుంటూరు జైలుకే విజయ్‌పాల్ కూడా వెళ్లాల్సి వచ్చిందని, ఇందులో ప్రధానవ్యక్తి పీవీ సునీల్‌కుమార్ అని రఘురామ తెలిపారు. తనపై చేసిన దారుణకాండకు శిక్ష అనుభవించక తప్పదని, తెలంగాణ అధికారి ప్రభాకర్‌రావు పారిపోయినట్లే ఈయన కూడా పారిపోయే అవకాశం ఉన్నందున లుకౌట్ నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర పోలీసులను కోరుతున్నానన్నారు. తనను చిత్రహింసలు పెట్టిన తర్వాత ఆ గదికి ఆర్‌ఆర్‌ఆర్ అని పేరుపెట్టి ఎంతోమందిని అందులోకి తీసుకెళ్లి బెదిరించి దందాలు చేసినట్లు తెలిసిందని రఘురామ వెల్లడించారు. సునీల్‌కుమార్, విజయ్‌పాల్ కలిసి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, చిత్రహింసలు పెట్టినరోజు తన ఛాతీపై బరువైన వ్యక్తి కూర్చున్నారని తెలిపారు. ఆ బరువుకు మంచం కోళ్లు విరిగి తన కాళ్లు పైకొచ్చాయని అన్నారు.
చిత్రహింసను ఎదుర్కొన్న మాజీ ఎంపీ గానే మాట్లాడుతున్నా: ఇప్పుడు ఆ అనుమానితులను గుర్తుపట్టే అవకాశం వచ్చిందని, విచారణ వేగం పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. పీవీ సునీల్‌కుమార్, బిహార్ వెళ్లిపోయిన సునీల్ నాయక్‌ను విచారించాలని కోరారు. తనను కొట్టడానికి ఆగంతుకులకు కిట్ ఇచ్చిన వ్యక్తి ఎవరో కూడా తనకు తెలుసని, ఆ వివరాలనూ పోలీసులకు ఇచ్చానని అన్నారు. అప్పటి సీఎం కోరికలను తీర్చడానికి తన మీద దారుణానికి ఒడిగట్టిన ఐపీఎస్‌లు, అప్పటి నేతలు కొన్ని రోజులు ఆలస్యమైనా దొరుకుతారని పేర్కొన్నారు. వారికి న్యాయస్థానంలో శిక్షలు పడతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. సాక్షి పత్రికలో విజయ్‌పాల్ అరెస్టు వార్తకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని బట్టి దీనివెనుక ఎవరున్నారు అనేది క్లియర్‌గా తెలుస్తోందని రఘరామ అన్నారు. తాను చిత్రహింసను ఎదుర్కొన్న మాజీ ఎంపీ గానే మాట్లాడుతున్నానని, ప్రస్తుత ఉపసభాపతికి, దీనికి ఎలాంటి సంబంధం లేదని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
"RRR కస్టోడియల్ హింస కేసు" - సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్‌కు రిమాండ్