Congress Wins in 13 MP Seats in Telangana :దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్కటైన తెలంగాణ నుంచి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు అభ్యర్థుల ఎంపికలోనూ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తూ 17 నియోజకవర్గాలకు గానూ 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం రాలేదు.
Khammam Congress MP Ticket : ఖమ్మం విషయంలో మంత్రులు తమకంటే తమకు టికెట్ కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అభ్యర్థి ఎంపికపై పీటముడి వీడటంలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా నెలకొనగా అటు తెరపైకి కొత్త పేర్లు వచ్చాయి. పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి, రచనాచౌదరి, రాజేంద్రప్రసాద్, ఉస్మానియా విద్యార్థి నేత లోకేశ్ యాదవ్‌ల పేర్లనూ ఖమ్మం నుంచి బరిలోకి దించే అంశంపై పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం టికెట్ ప్రకటన ఆధారంగానే కరీంనగర్ టికెట్ ఎవరికి ఇవ్వాలన్నదానిపై ఆధారపడి ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మంలో ఓసీకి టికెట్ ఇస్తే కరీంనగర్‌లో బీసీకికానీ, వెలమ సామాజికవర్గానికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ టికెట్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ ఉల్లాకు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్రకటించిన 14 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల పార్టీ నేతల సమన్వయంతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఉగాది పండుగ తర్వాత నియోజకవర్గాల్లో ప్రచార కోలాహలం మొదలవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
కరీంనగర్ అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్ఠానం త్వరగా నిర్ణయం తీసుకోవాలి : పొన్నం ప్రభాకర్
బీఆర్ఎస్ పాలన లోపాలే అస్త్రాలుగా : నెల రోజులపాటు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించడం, జాతీయ మేనిఫెస్టో(Congress Manifesto)తోపాటు వంద రోజుల రాష్ట్ర ప్రభుత్వ పాలన, ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, గత ప్రభుత్వ వైఫల్యాలు, అప్పులు చేసిన తీరును ఇంటింటికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తోంది. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు ప్రాథమికంగా బయట పెట్టిన విషయాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది.