Congress Party Election Campaign in Telangana : లోక్‌సభ ఎన్నికల ప్రచార బరిలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో సమావేశమవుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఉత్తమ్ విమర్శించారు. వరంగల్ పార్లమెంటు స్థాయి విస్తృత స్థాయి సన్నాహక సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామన్నారు.
"ఈరోజు బీఆర్ఎస్, బీజేపీలలో అభ్యర్థుల కొరత ఉంది. ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారిని మళ్లీ తీసుకువచ్చి పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నారు. ఈ రోజు వాళ్ల పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ఒక మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. అంబేడ్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు. ఓడిపోయి అధికారం కోల్పోయామనే ప్రస్టేషన్ వారిలో ఉంది." - కొండా సురేఖ, మంత్రి
ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ ఫోకస్- స్టార్ క్యాంపెయినర్‌గా రంగంలోకి సీఎం రేవంత్‌రెడ్డి
Congress Prachar in Telangana : సోనియా గాంధీ త్యాగం, గొప్పతనం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేయని బీజేపీకు రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శించారు.