Congress leaders Palamuru Rangareddy Project Tour :లోక్‌సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం అంశం, అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ మంటలు రేపుతోంది. చలో మేడిగడ్డ పేరుతోబీఆర్ఎస్(BRS) కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరగా, 'చలో పాలమూరు-రంగారెడ్డి' పేరుతో కాంగ్రెస్ నేతలు జలాశయాల పరిశీలనకు వెళ్లారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు చల్లా వంశీచంద్‌రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, పర్ణికారెడ్డి, వీర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించారు.
ముందుగా మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో గల కరివేన జలాశయానికి చేరుకున్న కాంగ్రెస్ నేతలు, రిజర్వాయర్ పనులను పరిశీలించారు. జలాశయం నిర్మాణం పనులు, కొనసాగుతున్న తీరు, నిధులకు సంబంధించిన విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూడేళ్లలో పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేస్తానన్న కేసీఆర్(KCR), ఎకరానికైనా నీరివ్వలేక పోయారని కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల్లో వాటా విషయంలోనూ గత బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందన్న ఆయన, ఆంధ్రపాలకులు నీటిని తరలించుకుపోతుంటే వారికి సహకరించారని విమర్శించారు. ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
'తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయిస్తే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకు వచ్చింది 212 టీఎంసీలు మాత్రమే. మనకు వచ్చే వాటా బీఆర్ఎస్ సాధించలేకపోయింది. వచ్చిన వాటాను కూడా ఉపయోగించలేకపోయింది. మనకు రావాల్సిన కృష్ణా నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు పోతుంటే గత ప్రభుత్వం అలసత్వం వహించింది.'-వంశీచంద్‌రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు