తెలంగాణ

telangana

ETV Bharat / politics

'హైడ్రాపై విష ప్రచారంతో కేటీఆర్, హరీశ్​రావు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారు' - Mynampally Slams On BRS Leaders

Mynampally Hanumantha Rao Comments On BRS : మూసీ ప్రక్షాళనపై రాద్దాంతం చేస్తున్న బీఆర్​ఎస్​, మల్లన్న సాగర్ బాధితులను ఎందుకు ఆదుకోలేదని కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ప్రశ్నించారు. గజ్వేల్​లో మల్లన్న సాగర్ బాధితులతో సమావేశమైన ఆయన, ప్రభుత్వం మంచి పనికి పూనుకుంటే బీఆర్ఎస్​ నాయకులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆక్షేపించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేస్తుందన్న మైనంపల్లి, నిర్వాసితులకు బాసటగా నిలిచేందుకు అన్ని పార్టీలు ముందుకురావాలని కోరారు.

Mynampally Slams On BRS Over Musi Demolitions
Mynampally Hanumantha Rao Comments on BRS (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2024, 4:42 PM IST

Updated : Oct 1, 2024, 4:49 PM IST

Mynampally Slams On BRS Over Musi Demolitions : బీజేపీతో కుమ్మక్కు అవుదామని బీఆర్ఎస్​ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. బీఆర్ఎస్​ను బీజేపీ నమ్మదని, ఇక ఆ పార్టీ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కపూర్‌లోని మల్లన్న సాగర్‌ను సందర్శించిన మైనంపల్లి, గులాబీ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కొంతమందికి కాలేజీలు, పెట్రోల్ బంకులు ఉన్నాయని, వాటిని పేదల పేర్లతో కొందరు నిర్వహిస్తున్నారని మైనంపల్లి ఆరోపించారు. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్​ దృష్టి పెట్టాలని కోరారు. సాగర్ ప్రభావంతో ముంపు గ్రామాలలో భూగర్భ జలాలు పెరగడంతో ఇండ్లలో నీరు వచ్చి చేరుతుందన్నారు. తమ కులస్థులే కొంతమంది పేదలను అడ్డం పెట్టుకుని హైడ్రా పేరుతో రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైడ్రాపై విష ప్రచారంతో చేయడం ద్వారా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని కేటీఆర్, హరీశ్‌రావులు ప్రయత్నిస్తున్నారని మైనంపల్లి ఆరోపించారు.

పోలీసులతో రైతులను కొట్టించిన ఘనత కల్వకుంట్ల కుటుంబానిదే : దత్తత గ్రామం కోల్గురులో కొన్ని ఇళ్లను బుల్డోజర్లతో స్వయంగా కూల్చి వేయించిన హరీశ్‌రావు, ఇప్పుడు బుల్డోజర్లకు అడ్డం పడుకుంటా అని మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల గోడు మీకు పట్టదా? హైడ్రా బాధితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న హరీశ్‌రావు, మల్లన్నసాగర్ నిర్వాసితులకు తాను ఇచ్చిన హామీ ముందు నెరవేర్చాలని మైనంపల్లి డిమాండ్ చేశారు.

పోలీసులతో రైతులను కొట్టించిన ఘనత కల్వకుంట్ల కుటుంబానికే దక్కిందన్నారు. మంచి ఉద్దేశంతో హైడ్రా ప్రారంభిస్తే కావాలని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లను అడ్డం పెట్టుకుని నెగటివ్ పోస్టులు పెడుతున్నారని విమర్శించారు. బీఆర్​ఎస్​ హయాంలో చెరువులు, కుంటలు, నాళాలు కబ్జా అయ్యాయన్నారు.

హరీశ్​రావు మహానటుడు, ఆయన ఏడుపునకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి : మొన్నటి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్​ ఖర్చు చేసినట్టు కాంగ్రెస్, బీజేపీలు చేయలేదన్నారు. వెంకట్రామిరెడ్డిని మెదక్ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయించి బలిపశువుని చేశారన్నారు. రూ.250 కోట్లు ఆయనతో ఖర్చు పెట్టించారని, అయిన ఆయనకి ఓట్లు వేయలేదన్నారు.

కేసీఆర్ రాజు, కేటీఆర్ యువరాజు, యువరాజు పోస్టు కోసం హరీశ్​రావు పోటీ పడుతున్నారాన్నారు. అజీజ్ నగర్​లో హరీశ్​రావుకి ఫామ్ హౌస్ ఉందన్నారు. పేదోళ్ల కోసం తాము ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అని, కమిషన్లు లేకుండా ఏ పనైనా చేశామని కేటీఆర్, హరీశ్​రావులు ప్రమాణం చేయగలరా? అని మైనంపల్లి హనుమంతరావు ప్రశ్నించారు. హరీశ్​రావు మహానటుడని, ఆయన ఏడుపునకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

Last Updated : Oct 1, 2024, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details