Khammam Congress Lok Sabha Ticket 2024 : శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి జోష్ మీదున్న కాంగ్రెస్, లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. మరోవైపు బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తూ జనంలోకి వెళ్తోంది. ప్రజలకు ఆరు హామీలను వివరిస్తూ బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ 17 స్థానాలకు గాను 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మరో మూడింటిని పెండింగ్‌లో ఉంచింది.
Lok Sabha Elections 2024 : ఈ క్రమంలోనే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్‌కు పెనుసవాల్‌గా మారింది. తమ వారికి సీటు కోసం ముఖ్య నాయకులు ఢీ కొడుతుండటం రాజకీయ అంతర్యుద్ధానికి దారితీస్తోంది. దీంతో ఇటు రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ, అటు కేంద్ర ఎన్నికల కమిటీ మల్లగుల్లాలు పడుతుండటంతో వాయిదాల పర్వం సాగుతోంది. రోజుకో పేరు తెరపైకి వస్తుండటం ఆశావహులకు చెమటలు పట్టిస్తుండగా పార్టీ కార్యకర్తలకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు.
Congress Election Campaign in Telangana 2024 :ఇప్పటికే కాంగ్రెస్ తరఫున ఖమ్మం లోక్‌సభ స్థానానికి రఘురామిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావుల పేర్లు ఇప్పటికే తెరపైకి రాగా తాజాగా ఇదే జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరును కొందరు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా నియమించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల రాయల నాగేశ్వరరావు ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొని పేరు ప్రకటించడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కొందరు ఆ పేరును తెరపైకి తెచ్చినట్లు తెలిసింది.