Congress Focus on Parliament Seats in GHMC : గ్రేటర్ హైదరాబాద్‌లో అధికార, విపక్ష పార్టీల లెక్కలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాజధానిలో ఊహించని ఫలితాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై గట్టిగానే గురిపెట్టింది. ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయిలో మంతనాలు సాగిస్తూ, బీఆర్ఎస్ను బలహీనపర్చేందుకు పావులు కదుపుతోంది.
GHMC Election Results : 2020లో గ్రేటర్‌లోని 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్- 55, ఎంఐఎం-44, బీజేపీ- 48 డివిజన్లలో గెలుపొందాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఏఎస్ రావు నగర్, ఉప్పల్, లింగోజిగూడలో మాత్రమే గెలిచింది. అందులో ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ గులాబీ పార్టీలోకి(BRS Party) వెళ్లడంతో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య రెండుకు పడిపోయింది. 56 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవానికి అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
కాంగ్రెస్‌లోకి చేరికల ప్రవాహం - ఆ 7 స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం 'ఆకర్ష్' వ్యూహం!
బల్దియాపై పూర్తి పట్టు కోల్పోయిన కాంగ్రెస్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆశించిన విజయాన్ని దక్కించుకోలేకపోయింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 29 స్థానాలకు మూడింట మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల టికెట్లు ఆశించి భంగపడ్డారు. దాంతో కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకున్నా గెలవలేకపోయారు.
EX Deputy Mayor Baba Fasiuddin Join In Congress :ఈ పరిణామాలతో, లోక్‌సభ ఎన్నికల్లోపు గ్రేటర్లో పార్టీని బలోపేతం చేసుకోకపోతే 4 ఎంపీ స్థానాలపై ప్రభావం పడుతుందని కాంగ్రెస్ సీనియర్లు అంచనా వేశారు. అందుకే ముందస్తుగా బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ తలుపులు తెరిచారు. అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Elections) ముందు ఖైరతాబాద్, మాదాపూర్, హఫీజ్ పేట, రహ్మత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ల చేరికతో బల్దియాలో కాంగ్రెస్‌కు ఆరు సీట్లు పెరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వివిధ స్థాయిల్లో ఉన్న అగ్ర నేతల సంప్రదింపులు, బీఆర్ఎస్ అధిష్ఠానంపై అసంతృప్తితో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌తోపాటు ఆయన సతీమణి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి హస్తం గూటికి చేరారు.
అలాగే బోరబండ బీఆర్ఎస్ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పది రోజుల వ్యవధిలోనే జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్, తార్నక కార్పొరేటర్ మోతె శ్రీలతతోపాటు బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు శోభన్ రెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో గ్రేటర్లో బీఆర్ఎస్ తేనెతుట్టె మరోసారి కదిలినట్లు అయింది. ఆరుగురు కార్పొరేటర్లు కాస్తా ఇప్పుడు తొమ్మిది మంది అయ్యారు.
లోక్‌సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌లో చేరికల జోరు - ఆ వ్యూహంలో భాగమేనా!