Graduate MLC By Election Results 2024 : రాష్ట్రంలో గత నెల 27న జరిగిన వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 తొలి ప్రాధాన్యత ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,248 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కుమార్‌కు 29,697 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తీన్మార్ మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో అభ్యర్థి గెలుపునకు 1,55,095 ఓట్లు కావాలి. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో మొత్తంగా 3,10,189 ఓట్లు పోల్‌కాగా, 25,824 ఇన్‌వ్యాలిడ్ ఓట్లు నమోదయ్యాయి. మరోవైపు ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్‌పై తప్పుల తడకగా జరుగుతుందంటూ వస్తున్న ఆరోపణలపై ఆర్వో హరిచందన స్పందించారు. కౌంటింగ్ తీరుపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే సిబ్బంది నివృత్తి చేస్తారని ఆర్వో హరిచందన సూచించారు.
అసలేం జరిగిందంటే.. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపించారు. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు లేకుండానే లీడ్ ప్రకటించారన్నారు. సందేహాలను నివృత్తి చేయకుండా ఆర్వోలు ఏకపక్షంగా వ్యవహరించారని, అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదని చెప్పారు.