మళ్లీ అవే అబద్ధాలు చెప్పిన జగన్ - మొత్తం ప్రసంగంలో అదొక్కటే నిజం CM YS Jagan Election Campaign: విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తా ! దసరాకు వచ్చేస్తా ! డిసెంబర్‌కు మకాం మార్చేస్తా ! ఇలా నాలుగేళ్లుగా పాడిందే పాట పాడుతున్న జగన్, ఎన్నికల శంఖారావంలో కనీసం మాట కూడా మాట్లాడలేదు ! ఉత్తరాంధ్ర గడ్డపై ర్యాంప్ షో చేసి కనీసం ఆ ఊసే ఎత్తలేదు, ఆ ప్రాంతానికి ఏం చేస్తారో కూడా చెప్పలేదు ! నవరత్నాలు తప్ప చెప్పుకోడానికేమీలేదన్నట్లుగా, ఎన్నికలకు వైసీపీ శ్రేణుల్ని సమాయాత్తం చేయడానికి జగన్ ఆపసోపాలు పడ్డారు.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని సంగివలస వద్ద ‘సిద్ధం’పేరిట బహిరంగ సభ నిర్వహించిన జగన్ అక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు. ఎప్పుడూ అరగంటలోపే ప్రసంగం ముగించే జగన్, ఈసారి గంట 15 నిమిషాలపాటు మాట్లాడారు. పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం అంటూ పాతపాట పాడారు. ఎప్పుడూ చెప్పే నవరత్నాల గురించి తప్ప అభివృద్ధి గురించి ఏమీ చెప్పుకోలేకపోయారు.
ఉత్తరాంధ్ర వేదికగా సభ పెట్టిన జగన్ అసలు ఆ ప్రాంతానికి ఏం చేశారు ? ఏం ప్రాజెక్టులు తెచ్చారో ఒక్క ముక్కకూడా చెప్పలేదు. చివరకు, విశాఖకు మకాం మారుస్తా అంటూ గతంలో అనేకమార్లు మాటలతో మభ్యపెట్టిన జగన్, ఈ సారి పాలనా రాజధాని ఊసెత్తనేలేదు. 3 రాజధానులే అజెండాగా వచ్చే ఎన్నికలంటూ వైసీపీ నాయకులు గతంలో సవాళ్లు కూడా విసిరారు. కానీ జగన్ మాత్రం విశాఖ రాజధాని సంగతేంటో సభలో తేల్చనేలేదు.
రాజు వెడలే- నాలుగు జిల్లాల బస్సులన్నీ భీమిలీ వైపు కదిలే! సీఎం సభకోసం భారీగా బస్సులు- ప్రయాణికులకు తీవ్ర అవస్థలు
వైసీపీ నాది, నా కోటరీలో ఉండే ఆ నలుగురిదే అన్నట్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మోనార్క్ మనస్థత్వాన్ని చాటుతున్న జగన్, విశాఖ సభలో మాత్రం కొత్తగా వైసీపీ జగన్‌ది కాదని, మీ అందరి పార్టీ అంటూ ఊరడించే ప్రయత్నం చేశారు. వైసీపీలో తగిన గౌరవం లేదని విశాఖ నేతలు వంశీకృష్ణ యాదవ్, సీతంరాజు సుధాకర్, పంచకర్ల రమేష్‌బాబు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో పార్టీలో కష్టపడిన వారికి అంచెలంచెలుగా పెద్దపీట వేశానంటూ జగన్ సర్థిచెప్పుకునే ప్రయత్నం చేశారు.
ఎప్పటిలాగే చంద్రబాబుపై విమర్శలు సంధించిన జగన్, వయసు మళ్లిన నాయకుడంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. గతంలో ఒక శంకుస్థాపన కార్యక్రమంలో టెంకాయ కొట్టడానికి నడుం వంచలేకపోవడంతో రాయిని కొందరు పైకి ఎత్తి చేతుల్లో పట్టుకుని నిలబడ్డారు. దానికి విమర్శలపాలైన జగన్, అదానీ డేటా సెంటర్ శంకుస్థాపన సమయంలో కొత్తగా ట్రై చేశారు. క్రికెట్ వికెట్లను తలపించేలా ఇనుప పైపులతో కొబ్బరికాయ కొట్టడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడా వీడియోలు పెట్టి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
వాలంటీర్ల గురించి నిజం అంగీకరించారు: జగన్ సుదీర్ఘ ప్రసంగంలో వాలంటీర్ల గురించి మాత్రం మొదటిసారి నిజం చెప్పారు ! పథకాలు అందించడానికే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామంటూ ఇన్నాళ్లూ చెప్పుకొచ్చారు. విపక్ష పార్టీలు మొదట్నుంచీ ఇదే విషయాన్ని చెప్తుంటే కొట్టిపారేస్తూ వచ్చిన జగన్, ఎన్నికలొచ్చేనాటికి వాలంటీర్లు మనవాళ్లే అంటూ అంగీకరించారు.
'సిద్ధం' అంటూ భీమిలిలో ఎన్నికల సమర శంఖం పూరించిన సీఎం జగన్