తెలంగాణ

telangana

ETV Bharat / politics

జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లింది : సీఎం రేవంత్‌రెడ్డి - WORLD TELUGU FEDERATION CONFERENCE

హెచ్‌ఐసీసీలో ప్రపంచ తెలుగు సమాఖ్య సభ ముగింపు కార్యక్రమం - హాజరై ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి

World Telugu Federation Conference
World Telugu Federation Conference (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2025, 10:54 PM IST

World Telugu Federation Conference : విదేశాలకు వెళ్లిన తెలుగువారంతా ఒకే వేదిక మీదకు రావడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీ వేదికగా మూడు రోజుల పాటు జరిగినటువంటి ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల ముగింపు కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. విదేశాలకు వెళ్లిన వారికి తెలుగు భాషతో అనుబంధం తగ్గిపోతోందని, జ్ఞానం కోసం ఏ భాష నేర్చుకున్నా తెలుగును తక్కువ చేయొద్దని ఆయన సూచించారు. హైదరాబాద్ నగరంలో అద్భుతమైన అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయని, నగరాభివృద్ధికి పాటుపడేందుకు తెలుగు ఇండస్ట్రియలిస్ట్‌లు(పారిశ్రామికవేత్తల)ను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి : రాజీవ్‌గాంధీ ఈ దేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేసి సాంకేతిక నైపుణ్యాన్ని అందించారు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కంప్యూటర్‌ యుగాన్ని ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. ఐటీ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసే సీఎంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఈరోజు ఈ ప్రాంతమంతా అత్యంత ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి జరుగుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అభివృద్ధి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మనకు అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు.

ఆర్థికంగా అభివృద్ధిపథం వైపు అడుగువేసేందుకు ఉపయోగపడుతోందన్నారు. అందుకు కొనసాగింపుగా వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో ఓఆర్‌ఆర్‌, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ రంగంతో పాటు, ఫార్మా రంగాల్లో పెట్టుబడులతో మరింత ముందుకు తీసుకెళ్లారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ఆదాయంలో 65 శాతం ఆదాయం హైదరాబాద్‌ నగరం నుంచే వస్తోంది. అందుకు కారణం ఆనాటి సీఎంలు తీసుకున్న నిర్ణయాలేనని వివరించారు.

జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లింది :దేశ రాజకీయాల్లో నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, నందమూరి తారక రామారావు ఎంతో కీలకంగా వ్యవహరించారని రేవంత్‌ రెడ్డి కొనియాడారు. ఆ తర్వాత వెంకటస్వామి, జైపాల్‌రెడ్డి, వెంకయ్యనాయుడు జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించారని రేవంత్ అన్నారు. రెండు మూడు తరాలకు మధ్య చంద్రబాబు నాయుడు, వైఎస్‌ఆర్‌ ప్రభావం చూపించినప్పటికీ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

సీజేఐగా జస్టిస్‌ ఎన్వీ రమణ, ఉప రాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా జైపాల్‌రెడ్డి రాణించిన సందర్భాల నుంచి చట్టసభల్లో ఎవరైనా తెలుగు వారు మాట్లాడుతారా చూద్దామని ఎదురుచూసే పరిస్థితి నెలకొందని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్‌ డ్రగ్‌లో 35 శాతం మన హైదరాబాద్‌ నగరం నుంచి తెలుగువాళ్లే ఉత్పత్తి చేస్తున్నారంటే ఇది మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details