CM Revanth Reddy At Assembly :ట్యాంక్‌బండ్‌లోని నీటిని కొబ్బరి నీళ్లు చేస్తానని తానెప్పుడూ చెప్పలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్‌కు, సీఎం రేవంత్‌కు మధ్య వాడివేడిగా వాగ్వాదం సాగింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, బతుకమ్మ చీరల కాంట్రాక్టు బినామీలకు ఇచ్చి సూరత్ నుంచి తీసుకువచ్చారా? లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరల విషయంలో ఆడబిడ్డలు తిరుగుబాటు చేశారా? లేదా? అని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీఎస్‌ను నిర్మిస్తామని కేంద్రం అంటే తిరస్కరించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అని అడిగారు.
హెల్త్ టూరిజం ఏర్పాటు :గురువారం సాయంత్రం 4 గంటలకు స్కిల్ వర్సిటీని ప్రారంభింస్తామని స్పష్టం చేశారు. స్కిల్ వర్సిటీని ప్రారంభోత్సవంలో ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చి పాల్గొనాలని కోరారు. హెల్త్ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేసి అంతర్జాతీయ వైద్యసౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. నిఖత్ జరినాకు గ్రూప్- 1 స్థాయి ఉద్యోగం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఏఐను వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి చెబుతామన్న ఆయన ముచ్చర్లలో ఫోర్త్ సిటీ నిర్మంచబోతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ముచ్చర్లలో ఫోర్త్ సిటీ వస్తుందని వివరించారు. పదేళ్ల అనుభవం ప్రజల కోసం వినియోగించాలన్న ఆయన రాజకీయాల కోసం కాదని హితవు పలికారు.