CM Revanth Serious on HYDRA Illegal Collections : హైడ్రా పేరు చెప్పి కొందరు అవినీతికి పాల్పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డుపెట్టుకుని డబ్బులు అడుగుతున్నారని అన్నారు. అమాయకులను భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కొన్నిచోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులపై ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. అక్రమంగా డబ్బు వసూలు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వసూళ్లకు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ విభాగాలను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు.
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ : గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వానికి, నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలని, ఇందుకోసం అందరి సలహాలు, సూచనలు తీసుకునేందుకే ఈ సమావేశం నిర్వహిచామని సీఎం వెల్లడించారు. నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి అని సీఎం స్పష్టం చేశారు. చిత్తశుద్ధి, నిబద్ధతతో ఉత్సవాలు నిర్వహించేట్లు జాగ్రత్త తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి సంబంధించి ఉత్సవ నిర్వాహకుల నుంచి సహకారం అవసరమన్నారు.