CM Revanth Reddy Said Special Act for Tenant Farmers :త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. రాష్ట్రంలో విద్యా విధానం(New Education Policy) ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందన్నారు. రైతులు, కౌలుదారుల సమస్యలు, సంక్షేమం, వ్యవసాయరంగ సంస్కరణలపై రైతు కమిషన్ సూచనలు ఇవ్వనుందని సీఎం తెలిపారు. సచివాలయంలో పలువురు సామాజిక, పౌర సంఘాల ప్రతినిధులతో సీఎం చర్చించారు. కౌలు రైతుల రక్షణపై అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
అందరి సూచనలు తీసుకొని కౌలు రైతుల(Tenant Farmers) రక్షణకు చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు సీఎం తెలిపారు. పంట పెట్టుబడి కోసం రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. నిస్సహాయులకు, నిజమైన లబ్ధిదారులకు అవసరమైతే చెప్పిన దానికంటే ఎక్కువ సాయం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో పంట మార్పిడి పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని, అన్ని పంటలు విస్తరించేలా రైతులు సరికొత్త విధానాలను అనుసరించాలన్నారు.
గురుకులాల సమీకృత భవన సముదాయం : రాష్ట్రంలో విద్యాలయాలను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను ఒకే చోట ఉండేలా సుమారు 25 ఎకరాల్లో సమీకృత భవన సముదాయం నిర్మించనున్నట్లు చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో ఇంటిగ్రేటేడ్ క్యాంపస్ నెలకొల్పి దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. అన్ని గురుకులాలు ఒకే చోట ఉండటం వల్ల కుల, మత వివక్ష తొలగడంతో పాటు విద్యార్థుల్లో ప్రతిభా పాఠవాలు, పోటీతత్వం పెరుగుతాయన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఏర్పడిన చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రూప్ 1, మెగా డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయని యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపడతామన్నారు.