CM Revanth Speech at Karnataka Public Meeting :కర్ణాటకలోని గుర్మిట్కల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా మల్లిఖార్జున ఖర్గే గెలిచారని వివరించారు. 1972లో మొదటిసారిగా మీరు ఎన్నుకున్న ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడుగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తుచేశారు. దశల వారీగా కర్ణాటకలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు.
గుర్మిట్కల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని, మీరు ఇచ్చిన స్ఫూర్తితోనే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ప్రజలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఐదు గ్యారంటీలను కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ కచ్చితంగా అమలు చేసిందన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోనూ అధికారం చేజిక్కుంచుకున్న హస్తం పార్టీ, ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసిందని చెప్పుకొచ్చారు. పదేళ్లలో మోదీ సర్కార్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు.
"గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 27 ఎంపీ సీట్లు అనుకూలంగా మీరు ఇచ్చారు. కానీ నరేంద్ర మోదీ మీకు ఇచ్చింది ఖాళీ చెంబు మాత్రమే. మీకు కరవు వస్తే కనీసం మీకు తాగటానికి కనీసం బెంగళూరుకు నీరు కూడా ఇవ్వలేదు. అటువంటి ప్రధానికి ఓటేస్తారో, మీరు ఆశీర్వదించిన మీ బిడ్డ ఖర్గేకు ఓటేస్తారో మీరే ఆలోచన చేయండి."- రేవంత్రెడ్డి, ముఖ్యమంత్రి
Revanth Reddy Comments on PM Modi :అధికారంలోకి వచ్చిన మరుక్షణమే స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామన్న మోదీ మాట తప్పారన్నారు. 40కోట్ల ఖాతాలు తెరిపించిన ప్రధాని, ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో జమచేయలేదన్నారు. కర్ణాటక నుంచి 26ఎంపీలను భారతీయ జనతా పార్టీకి ఇస్తే, మోదీ రాష్ట్రానికి కేవలం ఒకటే కేబినెట్ పదవి ఇచ్చారన్నారు. మోదీ కర్ణాటకకు ఇచ్చింది ఏమీ లేదని, ఖాళీ చెంబు తప్ప అని ఎద్దేవా చేశారు.