CM Revanth Reddy on Parliament Elections 2024 : రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు ప్రచార శంఖారావాన్ని పూరించబోతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఏప్రిల్ 6 లేదా 7న జరిగే జన జాతర సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చేవేళ్ల లోక్‌సభ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉందన్న ఆయన, అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ బరిలో దానం నాగేందర్‌ను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు, ప్రభుత్వ 100 రోజుల పరిపాలనకు రెఫరెండమన్న ఆయన, తెలంగాణలో 14 స్థానాలు గెలిచి సోనియమ్మకు కృతజ్ఞత చెబుదామని స్పష్టం చేశారు.
'14 ఎంపీ సీట్లే లక్ష్యంగా గెలిచి తీరాలి' - నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం