CM Revanth Reddy MLC Champaign:11 ఏళ్ల ప్రధాని మోదీ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారని, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2014, 2019 ఎన్నికల ప్రచారంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 2 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, ఒకటి కిషన్‌రెడ్డికి మరొకటి బండి సంజయ్‌కు అని ఎద్దేవా చేశారు. వీరికి కాకుండా ఇంకెవరికైనా ఇచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల, కరీంనగర్‌లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
నేను చెప్పింది అబద్ధమైతే మాకు ఓటు వేయొద్దు :తమ ప్రభుత్వం వచ్చాక మొత్తం 55,163 మందికి ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామకపత్రాలు అందజేశామని అన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు టెట్ నిర్వహించామని గుర్తు చేశారు. 11,000 మంది టీచర్ల నియామకం చేపట్టామని, పోలీసుశాఖలో 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. 6,000 పైగా పారామెడికల్ సిబ్బందిని నియమించామని అన్నారు. తాను చెప్పింది అబద్ధమైతే తమకు ఓటు వేయొద్దని, నిజమని నమ్మితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించండని కోరారు.
హైటెక్ సిటీ కట్టింది మేమే. ఫ్యూచర్ సిటీ కట్టేది కూడా మేమే :ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణకు ఎంపీ ఈటల రాజేందర్ అడ్డంగా పడుకుంటున్నారని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఈటల కలిసి రాష్ట్రం అభివృద్ధి కాకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. హైటెక్ సిటీ కట్టింది మేమే. ఫ్యూచర్ సిటీ కట్టేది కూడా మేమేనని వెల్లడించారు.