CM Revanth Election Campaign in TS 2024 : లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ మరింత హోరెత్తిస్తోంది. మరో వారం రోజులే గడువుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ధర్మపురి, సిరిసిల్లలో జన జాతర సభలకు హాజరైన ఆయన, బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ పదేళ్లలో తెలంగాణకు ఇచ్చిందేం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన భారతీయ జనతా పార్టీకి ఓట్లడిగే హక్కు లేదని దుయ్యబట్టారు. భారత్ రాష్ట్ర సమితి అంటే బిర్లా రంగా సమితిగా అభివర్ణించారు. రిజర్వేషన్ల రద్దుపై ఆ రెండు పార్టీలది ఒకే విధానమని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కేటీఆర్ ప్రపంచంలో ఉన్నవన్నీ మాట్లాడతారు. కోనసీమ నుంచి చిత్రసీమ వరకు ఎక్స్ (ట్విటర్)లో మాట్లాడతారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ యత్నిస్తుంటే ట్విటర్ టిల్లు ఎందుకు ప్రశ్నించటం లేదు. రిజర్వేషన్ల రద్దుపై బీఆర్ఎస్, బీజేపీలది ఒకే విధానం. 2022లో రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ చెప్పారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే చూస్తూ ఊరుకుందామా? ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీతో కలవడానికి గులాబీ పార్టీ సిద్ధమైంది. - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ దగ్గర తాకట్టు : దిల్లీ మద్యం కేసులో కవిత బెయిల్ కోసం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ దగ్గర తాకట్టు పెట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత వారిద్దరూ కలిసి పోతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందన్న ముఖ్యమంత్రి, వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లకు పట్టిన పీడను వదిలిస్తానని వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నేతన్నల బకాయిలు పూర్తిగా చెల్లించడంతో పాటు వారిని ఆదుకుంటామని రేవంత్‌రెడ్డి తెలిపారు.
రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణనలో జాప్యం : సీఎం రేవంత్ - CM Revanth Jana Jatara Sabha