తెలంగాణ

telangana

ETV Bharat / politics

రాష్ట్రంతో పేగుబంధం తెంపుకుంటూ కేసీఆర్ పార్టీ పేరు కూడా మార్చుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి - CM REVANTH REDDY COMMENTS ON KCR

నిజామాబాద్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి - రాష్ట్రం కోసం పోరాడిన పట్టభద్రుల కోసం కేసీఆర్‌ ఏం చేశారని ప్రశ్నించిన ముఖ్యమంత్రి

CM Revanth Reddy Comments on KCR
CM Revanth Reddy Comments on KCR (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2025, 4:30 PM IST

CM Revanth Reddy Comments on KCR :తెలంగాణ రాష్ట్ర సాధనలో పట్టభద్రులది కీలక పాత్రని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ నేతలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన పట్టభద్రుల కోసం కేసీఆర్‌ ఏం చేశారని ప్రశ్నించారు.

వాళ్లే కేసులు వేశారు :కేసీఆర్‌ అవసరం తెలంగాణకు లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని, రాష్ట్రంతో పేగుబంధం తెంచుకుని పార్టీ పేరు కూడా మార్చుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. చేసింది చాలు ఇక ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోవాలని ప్రజలు ఆయనకు చెప్పారని ఎద్దేవా చేశారు. ప్రజలు తిరస్కరించినా కేసీఆర్‌లో మార్పు రాలేదని, ఫామ్‌ హౌస్‌లో కూర్చుని రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పది సంవత్సరాల పాటు ఏమీ చేయని బీఆర్​ఎస్​ నేతలు, ఇవాళ తమని తప్పుపడుతున్నారని, ఏడాదిలోనే తాము ఏమీ చేయలేదని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

పది సంవత్సరాల పాటు నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చిన వాటి మీద వాళ్లే కేసులు వేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం ఏడాదిలోనే 55,163 మందికి జాబ్స్ ఇచ్చిందని, 11,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల పాటు టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించలేదని వెల్లడించారు. తమ ప్రభుత్వం రాగానే వాటిని పూర్తి చేశామని పేర్కొన్నారు.

క్రీడల్లో యువత రాణించేందుకు స్పోర్ట్స్‌ యూనివర్సిటీ :చదువుతున్న యువతలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని, టాటా సంస్థతో కలిసి 65 ఐటీఐలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చామని వివరించారు. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, క్రీడల్లో యువత రాణించేందుకు స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, నిజామాబాద్‌కు చెందిన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు గ్రూప్‌-1 ఉద్యోగం ఇచ్చి రూ.2కోట్ల ప్రోత్సాహక నగదు అందజేశామని, క్రికెటర్‌ సిరాజ్‌కు ఎన్నో మినహాయింపులతో గ్రూప్‌-1 ఉద్యోగం ఇచ్చామని గుర్తు చేశారు. పారా అథ్లెట్‌, వరంగల్‌ బిడ్డ జివాంజీ దీప్తికి రూ.25లక్షలు, ఇంటి స్థలం ఇచ్చామని అన్నారు.

మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ అప్పుల కుప్పగా చేశారు :26.50 లక్షల మంది రైతులకు రూ.2లక్షల చొప్పున రుణమాఫీ చేశామని, సన్న వడ్లకు రూ.500 బోనస్‌ వచ్చి ఉంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండని సీఎం కోరారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్‌ రూ.7లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశారని ఆరోపించారు. ఆ అప్పులకు ప్రతి నెలా రూ.600 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని, కేసీఆర్‌ పాలనలో ఏనాడూ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు రాలేదని విమర్శించారు.

ఉద్యోగులు రిటైర్‌ అయితే వాళ్లకు బెనిఫిట్స్‌ ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కేసీఆర్‌ రూ.8వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని ఆరోపించారు. దేశంలో ఎవరూ చేయని సాహసాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిందని, రాహుల్‌గాంధీ ఆశయం మేరకు తెలంగాణలో కులగణన సర్వే పూర్తి చేశామని వెల్లడించారు. వంద సంవత్సరాలుగా జరగని కులగణనను సమర్థంగా నిర్వహించామని వివరించారు.

"కేసీఆర్‌ అవసరం రాష్ట్రానికి లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు. రాష్ట్రంతో పేగుబంధం తెంపుకుంటూ పార్టీ పేరు కూడా మార్చుకున్నారు. చేసింది చాలు ఇక ఫామ్‌హౌజ్‌లో విశ్రాంతి తీసుకోమ్మని కేసీఆర్‌కు ప్రజలు చెప్పారు. ప్రజలు తిరస్కరించినా కేసీఆర్‌లో మార్పు రాలేదు. ఫామ్‌హౌజ్‌లో కూర్చుని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పట్టభద్రులది కీలకపాత్ర. రాష్ట్రం కోసం పోరాడిన పట్టభద్రుల కోసం కేసీఆర్‌ ఏం చేశారు. పదేళ్ల పాటు ఏమీ చేయని బీఆర్‌ఎస్‌ నేతలు ఇవ్వాళ మమ్మల్ని తప్పు పడుతున్నారు."- రేవంత్‌రెడ్డి, సీఎం

ఓడితే ముక్కు నేలకు రాస్తా - కేసీఆర్‌, కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్

కులగణన సర్వేలో పాల్గొనకపోతే కేసీఆర్, కేటీఆర్​ల​కు సామాజిక బహిష్కరణే శిక్ష: సీఎం రేవంత్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details