CM Revanth Counter to Etela on Phone Tapping Issue : సీఎం రేవంత్ ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డంపెట్టుకొని దౌర్జన్యం చేస్తే, గత పాలకులకు ఏ గతి పట్టిందో అదే గతి పడుతుందని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లో పలు కాలనీ సంఘాలు (Colony Societies) ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఈటల, రేవంత్ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్‌ల మాదిరిగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ (Congress Party High Command) మెప్పు పొందడానికి బిల్డర్లను, వ్యాపారవేత్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఖబర్ధార్ అంటూ ఈటల హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, దేశ ప్రజలకు ధైర్యాన్ని అందించిన నాయకుడు నరేంద్ర మోదీ అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు మద్దతు ప్రకటించిన పలు కాలనీ సంఘాలకు ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.
"రేవంత్ ఒళ్లు, నోరు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి. ఇవాళ అధికారం ఉందని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించడానికి సిద్ధంగా లేరు. ఆ మధ్యకాలంలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి, రాజకీయ నాయకుల కాల్స్‌ను ట్యాపింగ్ చేశారు. అదే కోవలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ హై కమాండ్ మెప్పు పొందేందుకు, ఫండ్స్ పంపించడానికి ఇక్కడి వ్యాపారస్థులను బెదిరించటం, బ్లాక్‌మెయిల్ చేయటం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. తెలంగాణకు మీరే అన్ని అనుకుంటే పొరపాటు. మీపైనా నిఘా పెట్టిన వారు ఉన్నారు." - ఈటల రాజేందర్, బీజేపీ నేత