CM Revanth Chevella Meeting Today :అసెంబ్లీ ఎన్నికల నాటి ఊపు కాంగ్రెస్ శ్రేణుల్లో ఏమాత్రం తగ్గలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఉత్సాహాన్ని లోక్‌సభ ఎన్నికల్లోనూ చూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో అణచివేతకు గురికాని వర్గం ఒక్కటీ లేదన్న రేవంత్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో ఎందరో కార్యకర్తల శ్రమ, రక్తం ఉందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ శ్రేణుల త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోనని, వాళ్ల రుణం తీర్చుకుంటామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన జాతర బహిరంగ సభ (Congress Jana Jatara Meeting Chevella) లో సీఎం రేవంత్ సహా, మంత్రులు ప్రసంగించారు.
"కేసీఆర్ తన కుటుంబీకుల ఉద్యోగాల గురించి మాత్రమే ఆలోచించారు. కేసీఆర్ తన కుమార్తె, కుమారుడు, అల్లుడు, బంధువుల పదవుల గురించే ఆలోచించారు. మేం అధికారంలోకి వచ్చిన 2నెల్లలోపే 25 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. త్వరలోనే మెగా డీఎస్సీ వేసి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం. తండ్రి పేరు చెప్పుకుని పదవుల్లో కూర్చున్న వ్యక్తిని కాదు నేను. దుర్మార్గులను, అవినీతిపరులను తొక్కుకుంటూ వచ్చివ వ్యక్తిని. తెలంగాణను దోచుకున్న కేసీఆర్ కుటుంబానికి ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు. ఎంపీలను గెలిపించటంతోనే నా బాధ్యత తీరిపోదు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి న్యాయం చేస్తాం. కార్యకర్తలను సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా గెలిపించినప్పుడే నా బాధ్యత నెరవేరుతుంది." - రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి
Bhatti Vikramarka At Congress Meeting Chevella : అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారని అన్నారు. రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని తెలిపారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలో కరెంట్ ఉందో లేదో ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.
సచివాలయంలో సబ్సిడీ వంట గ్యాస్, ఫ్రీ కరెంట్ పథకాలు ప్రారంభం
"గత ప్రభుత్వం ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి ఈ ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసింది. తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ వద్ద కట్టారు. నిపుణులు, ఇంజినీర్లు వద్దంటున్నా మేడిగడ్డ వద్ద కట్టారు. అద్భుతంగా కట్టామని కేసీఆర్ చెప్పిన ప్రాజెక్టులు ఇవాళ పగుళ్లు పట్టాయి. రూ.లక్ష కోట్ల నిధులు గోదావరిలో పోసి వృథా చేశారు. పాలమూరు ప్రాజెక్టు కడుతున్నామని చెప్పి ఆ జిల్లాకు ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు."- భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం
ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu on Six Guarantees) అన్నారు. కాంగ్రెస్ వచ్చేది లేదు ఇచ్చేది లేదని వెటకారంగా మాట్లాడారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదని తెలిపారు. ఖాజానా ఖాళీ ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఆర్థిక క్రమశిక్షణతో పని చేస్తూ నిధులు సమకూర్చుకుని ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్పారు.