CM Jagan Kodikatti Case Accused Srinivas Bail Petition in HC: సీఎం జగన్ కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతూ ఏపీ హైకోర్టులో న్యాయవాదులు పిచ్చుక శ్రీనువాస్, పాలేటి మహేశ్ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ ప్రస్తుతం జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడని, ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని న్యాయవాదులు పిటిషన్లో పేర్కొన్నారు.
దీంతోపాటు శ్రీనివాస్కు మద్దతుగా ఆయన తల్లి సావిత్రి కూడా నిరాహార దీక్ష చేపట్టి ఆరోగ్యరీత్యా ఆదివారం దీక్ష విరమించారని పిటిషన్లో తెలిపారు. శ్రీనివాసరావు సుమారు ఐదేళ్లగా జైలులోనే మగ్గుతున్నాడని, త్వరగా పిటిషన్పై విచారణ జరపాలని పిటిషనర్ తరఫున న్యాయవాదులు కోరారు. ఈ నేపథ్యంలో కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను బెయిల్ పిటిషన్పై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.
మరోవైపు జైలులో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను ఆరోగ్యం క్షీణించినట్లు దళిత సంఘాల నేతలు తెలిపారు. విశాఖ జైలులో ఈ రోజు శ్రీనును కలిశారు. దీక్ష విరమించాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని శ్రీను తెలిపిట్లు చెప్పారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, విశాఖ నుంచి తరలించాలని శ్రీను కోరుతున్నాడని దళిత నేతలు తెలిపారు.
కోడికత్తి కేసులో ఎందుకీ జగన్నాటకం?
Kodi Kathi Srinu Family Hunger Strike:కాగా సీఎం జగన్ కోర్టులో సాక్ష్యం చెప్పి, తన కుమారుడికి న్యాయం చేయాలని కోరుతూ శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు నిరవధిక నిరాహార దీక్షను చేపట్టగా శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. అనంతరం వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఆసుపత్రిలో కూడా వారు వైద్యానికి నిరాకరించి దీక్షను కొనసాగించారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు వచ్చి వారితో మాట్లాడారు. న్యాయపోరాటం చేద్దామని, దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆరోగ్యరీత్యా వారు దీక్షను విరమించారు.