TDP Leaders Fires on YS Jagan : వల్లభనేని వంశీపై కిడ్నాప్ కేసు అక్రమమంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేసిన విమర్శలకు టీడీపీ ఘాటుగా బదులిచ్చింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారు సత్యవర్ధన్‌ను వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. ఈ నెల 11న సత్యవర్ధన్‌ను వంశీ కిడ్నాప్ చేశారనడానికి ఈ దృశ్యాలే సాక్ష్యమన్నారు. ఓ కిడ్నాపర్‌ను జైలుకు వెళ్లి పరామర్శించిన జగన్ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని నేతలు ప్రశ్నించారు.
నేరస్థుడైన జగన్ మరో నేరస్థుడిని సబ్ జైలులో కలిసి కట్టుకథలు బాగా అల్లారని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. నాలుగు కాగితాలు, మరో 4 మైకులు ముందుంటే ఎలాంటి కథలైనా ఆయన అల్లేస్తారని దుయ్యబట్టారు. తాము కక్షసాధింపులకు పాల్పడాలనుకుంటే ఈ ఎనిమిది నెలల్లో ఎవ్వరూ బయట తిరిగేవారు కాదని అన్నారు. గతంలో బూటకపు ఓదార్పు యాత్ర చేసిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేడు జైలు యాత్రలు మొదలెట్టారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. పాత జైలు పక్షి మళ్లీ కారాగారానికి వెళ్లి రౌడీలు, గూండాలకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. వంశీ ఏదో వీర పోరాటం చేస్తే జైలులో పెట్టినట్లుగా జగన్ మాటలు ఉన్నాయని విమర్శించారు.
"గతంలో ఓదార్పు యాత్ర చేశారు ఇప్పుడు జైలు యాత్ర చేపట్టారు. పాత జైలుపక్షి రౌడీలు, గూండాలకు వత్తాసు పలుకుతున్నారు. ఏదో వీరపోరాటం చేసిన వ్యక్తిని జైలులో పెట్టినట్లు జగన్ మాటలున్నాయి. వంశీకి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు బాధపడ్డారు. జగన్ అరాచకాలపై 8 నెలలుగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. వాళ్లపై వచ్చే ఫిర్యాదులు చూసైనా ఆయన బుద్ధి తెచ్చుకోవాలి." - అనగాని సత్యప్రసాద్, మంత్రి
Vallabhaneni Vamsi Case Updates : పరామర్శించడానికి జైలుకెళ్లిన జగన్ కులాల గురించి మాట్లాడటం ఏంటని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యల్ని వైఎస్సార్సీపీ నేతలు కూడా సమర్ధించరని చెప్పారు. వంశీ, కొడాలి నాని లాంటి వారిపై ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా తమ ముఖ్యమంత్రి ఒప్పుకోలేదని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. వారు చేసిన అరాచకాలు, వాడిన భాషా రాష్ట్రంలో ఏ ఒక్కరూ మర్చిపోరని పేర్కొన్నారు. కక్ష సాధింపులు తమకు తెలియదు కాబట్టే వైఎస్సార్సీపీ నేతలు ఇంకా ఆమాత్రం రోడ్లపై తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.
వృత్తి ధర్మం నిర్వహిస్తున్న పోలీసులను బెదిరించడం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సమంజసం కాదని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అన్నారు. జైలుకు వెళ్లి వల్లభనేని వంశీని పరామర్శించిన జగన్ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారన టీడీపీ నేత, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి ప్రశ్నించారు. దళిత యువకుడు సత్యవర్ధన్‌ను వంశీ కిడ్నాప్ చేసినట్లు సీసీ ఫుటేజీతో తాము రుజువు చేశామని దీనిపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
TDP Leaders on Vamsi Case : జగన్‌కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. దోపిడీదారు వల్లభనేని వంశీతో ములాఖాత్పై ఆయన జవాబివ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచిన నేరస్థుడికి పరామర్శ ఎందుకని ప్రశ్నించారు. దళిత ఉద్యోగి సత్యవర్ధన్‌ను హత్య చేస్తానని బెదిరించిన వంశీని ఎలా పరామర్శిస్తారని చెప్పారు. మొత్తం 10 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి పంపించారు.
వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. పోలీసుల టోపీలపై సింహం గుర్తులు ఉంటాయని ఆయన తెలుసుకున్నందుకు అభినందిస్తున్నానని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పోలీసు యంత్రంగాన్ని సొంత సైన్యంలా వాడుకున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికే వారిని ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఇప్పుడు పోలీసుల టోపీలపై సింహం బొమ్మలు ఉంటాయని, వాటిని గౌరవించాలని జగన్ హితవు పలకడం విడ్డూరంగా ఉందన్నారు.
కిడ్నాప్ చేస్తూ సీసీ కెమెరాలు మరిచారు - మరోసారి అడ్డంగా దొరికిపోయిన వంశీ గ్యాంగ్