NDA Leaders Fires on YS Jagan Mohan Reddy: విజయవాడ జిల్లా జైలులో ఉన్న వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కలవడంపై కూటమి నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దళిత ఉద్యోగి సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి హింసించి హత్య చేస్తానని బెదిరించిన వంశీని ఏ మొహం పెట్టుకుని జగన్ పరామర్శించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినందుకు మద్దతు ఇస్తున్నారా అని ప్రశ్నిస్తూ జగన్‌మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. జైలులో ఉన్న దళిత వ్యతిరేకి, మహిళా ద్రోహి అయిన వంశీని పరామర్శించేందుకు వచ్చిన జగన్, ఎందుకు ములాఖత్ అయ్యారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్‌కు దళితుల కన్నా నేరస్థుడు ఎక్కువైపోయాడా అని ప్రశ్నించారు. ప్రజాస్వౌమ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలోనే దుశ్సాసునిలా మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచిన నేరస్థుడిని ఏ రకంగా పరామర్శిస్తారని ప్రశ్నించారు. మహిళల వ్యక్తిత్వం కన్నా నేరస్థుడు వంశీ ఎక్కువైపోయాడని దుయ్యబట్టారు. గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని నిలువునా తగలబెట్టించి, మహిళా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వారాల తరబడి హింసించిన వంశీని ఎలా పరామర్శిస్తారని అన్నారు.
జగన్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి: తల్లి, చెల్లిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టించిన జగన్‌కు, ఇతర మహిళలపైన గౌరవం ఉంటుందా అని నిలదీశారు. సంకల్ప సిద్ధి చిట్ ఫండ్స్ 16000 మంది కుటుంబాలను రోడ్డున పడేసిన వంశీని ఎలా పరామర్శిస్తారని మండిపడ్డారు. పట్టిసీమ గట్టు మట్టిని అక్రమంగా తరలించి రైతుల ద్రోహి అయిన వంశీని ఎలా పరామర్శించడానికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గన్నవరం నియోజకవర్గం ప్రజలకు 11 వేల దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చి సొంత ఇంటి కలను దూరం చేసిన వంశీకి ఏ విధంగా మద్దతు పలుకుతారని విమర్శించారు. బాపులపాడు, గన్నవరం, మండవల్లి ప్రాంతాల్లో చెరువులను, కొండలను అక్రమంగా తవ్వించి అమ్ముకున్న గ్రావెల్స్ మాఫియా వంశీకి జగన్ ఎలా మద్దతు ఇస్తారని ధ్వజమెత్తారు. ఎయిర్ పోర్టు భూములను సైతం కబ్జా చేసిన వంశీని ఎందుకు కలిశారో జగన్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
నేరస్థులకు అండగా జగన్: దళితుడైన సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును సత్కరించి, జగన్ దళిత వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకున్నారని మాజీ మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. సుబ్రమణ్యం కుటుంబాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశారని మండిపడ్డారు. గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపినా జగన్ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాజకీయాలకు దళితుడైన కోడికత్తి శ్రీను బలయ్యాడని దుయ్యబట్టారు.
దళిత బాధితులను పరామర్శించడానికి రాని జగన్, ఇప్పుడు నేరస్థులకు అండగా నిలిచారని విమర్శించారు. సత్యవర్దన్‌ను పరామర్శించటానికి జగన్‌కు ఎందుకు మనసు రాలేదని ప్రశ్నించారు. జగన్ పెత్తందారి మనస్తత్వం దళితులకు శాపమయిందని, వైఎస్సార్సీపీ పాలనలో వర ప్రసాద్‌కు శిరోముండనం ప్రజలు ఇంకా మరచి పోలేదన్నారు. డాక్టర్ సుధాకర్‌ని వేధించి చంపినా ఆయన కుటుంబాన్ని పరామర్శించలేదని, జగన్ వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
విమర్శిస్తే దాడులు - ప్రశ్నిస్తే వేధింపులు - వంశీ గ్యాంగ్ అకృత్యాలు