Fifth List Tension in YSRCP Leaders: అధికార వైఎస్సార్సీపీలో నియోజక వర్గాల్లో పార్టీ ఇన్ చార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను తప్పిస్తోన్న సీఎం జగన్ మరికొందరి పైనా వేటు వేసేందుకు సిద్దమయ్యారు. దీనికోసం గడచిన వారం రోజులుగా కసరత్తు చేస్తున్నారు. తమ టికెట్ చించొద్దని పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లి కి వచ్చి విన్నవించుకుంటున్నారు. తమకే అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కలసి కోరుతున్నారు.
ఐదో జాబితా కోసం కొనసాగుతున్న కసరత్తు: అధికార వైఎస్సార్సీపీ లో ఐదో జాబితా పై వారం రోజులుగా కసరత్తు కొనసాగుతోంది. పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. ఇప్పటికే 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల టికెట్లు చింపేయడంతో మిగిలినవారిలో ఆందోళన పెరుగుతోంది. సీఎం జగన్.. ఇప్పటికే 4 జాబితాల్లో 59 అసెంబ్లీ స్థానాలు, 9 ఎంపీ స్థానాల్లో ఇన్ చార్జీలను మార్చేశారు. మరికొన్ని కీలక స్థానాల్లోనూ ప్రస్తుతం ఉన్న ఇన్ చార్జీలను తీసివేసేందుకు కసరత్తు చేస్తూ ఐదో జాబితా రూపొందిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఐదో జాబితాను విడుదల చేయనున్న నేపథ్యంలో తాడేపల్లి లోని సీఎంవో నుంచి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు వచ్చింది. నియోజకవర్గ ఇన్ చార్జీల మార్పులపై చర్చించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాడేపల్లికి సీఎం జగన్ పిలిపించారు.
రేపో, ఎల్లుండో వైసీపీ ఐదో జాబితా - టికెట్ ఉంటుందో ఊడుతుందో తెలియక నేతల టెన్షన్
సీఎంవో కు క్యూ కట్టిన మంత్రులు ఎమ్మెల్యేలు:సీఎం వో నుంచి పిలుపు మేరకు క్యాంప్ ఆఫీస్కు నేతలు క్యూ కట్టారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, మంత్రి ఉష శ్రీ చరణ్, మాజీ మంత్రి కూరసాల కన్న బాబు, క్యాంపు కార్యాలయానికి వచ్చి సజ్జల రామకృష్ఠారెడ్డి సహా సీఎం రాజకీయ కార్యదర్శి ధనుంజయ రెడ్డి ను కలిశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆదాల ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధు సూదన్ యాదవ్, సహా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సీఎం వోకు పిలిపించిన సీఎం రాజకీయ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వారిని కలసి మాట్లాడారు. ఆయా నియోజకవర్గాల్లో చేసిన సర్వే వివరాలను తెలియజేశారు. పార్టీ ఇన్ చార్జీల మార్పులపైనా చర్చించారు. రేపల్లె సీటు తనకే ఇవ్వాలని కోరుతోన్న రీజినల్ కో ఆర్డినేటర్ మోపిదేవి వెంకటరమణ మరో సారి సీఎంవో కు వచ్చి మంతనాలు జరిపారు. నేతలతో మాట్లాడిన పార్టీ నేతలు వివరాలను సీఎంకు తెలిపారు.
సీఎం క్యాంపు కార్యాలయానికి అనంతబాబు: దళితున్ని చంపి డోర్ డెలివరీ చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటికే వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేసినా, క్యాంపు కార్యాలయంలో జరిగే అధికారిక సమావేశాలన్నింటికీ ఆయనకు ఆహ్వానం అందుతోంది. ఎమ్మెల్యే ధనలక్ష్మి తో పాటు క్యాంపు కార్యాలయానికి వచ్చిన అనంతబాబు పార్టీ పెద్దలను కలసి తమ నియోజకవర్గంలో పరిస్ధితిని వివరించారు.
వైసీపీ నేతలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితోనే ఓటర్ల జాబితాల్లో అవకతవకలు-సీడీఎఫ్