Bollywood Actress In Telugu Movies : తెలుగు సినిమాలో నటించడం కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తున్నారు. వైవిధ్యభరిత కథలు, పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తెరకెక్కడమే అందుకు ప్రధాన కారణం. భాషల మధ్య హద్దుల్ని చెరిపేస్తూ ప్రపంచం నలుమూలలకీ తెలుగు సినిమా చేరువవుతోంది. అందుకే కథ నచ్చిందంటే చాలు, ఏ మాత్రం ఆలోచించకుండా బీ టౌన్ భామలు హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. అలా 2024లో తెలుగు సినిమాల్లో మెరిసిన బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో చూద్దాం.
సుమతిగా దీపికా
దీపికా పదుకొణె ఎప్పట్నుంచో టాలీవుడ్‌ను ఊరిస్తోంది. అప్పట్లో పలుసార్లు ఆమె పేరు ప్రచారంలోకి వచ్చినా, తెలుగులో మాత్రం నటించలేదు. కానీ, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'కల్కి 2898 ఎడి' సినిమాకు దీపిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇదే ఆమెకు తొలి తెలుగు సినిమా. ఈ సినిమాలో సుమతి పాత్రలో దీపిక తన నటనతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇక ఇదే సినిమాలో బాలీవుడ్ మరో బ్యూటీ దీశా పటానీ కూడా నటించింది. కానీ ఆమె ఇప్పటికే తెలుగులో 'లోఫర్' సినిమాతోనే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.
తంగం
ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో 'తంగం' పాత్రలో అచ్చమైన తెలుగమ్మాయిగా కనిపించింది జాన్వీ కపూర్. ఈ సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ అందం, డ్యాన్స్‌తో జాన్వీకి మంచి మార్కులు పడ్డాయి. ఆమెకు కూడా టాలీవుడ్లో తొలి సినిమా ఇదే. ఈ సినిమా విజయం ఆమెకు మరింత జోష్‌నిచ్చే విషయం. కాగా, ఇంతలోనే రామ్‌చరణ్ సరసన నటించే అవకాశాన్ని కూడా జాన్వీ దక్కించుకుంది. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సినిమాలో చెర్రీ సరసన జాన్వీ హీరోయిన్గా కనిపించనుంది.
ప్రయత్నం చేసిందిలే
మిస్ వరల్డ్ భామ మనూషి చిల్లర్ 2024లో 'ఆపరేషన్ వాలెంటైన్'తో తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకుంది. వరుణ్‌తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయనకి భార్యగా, వింగ్ కమాండర్‌గా నటించింది. తెలుగుతోపాటు, హిందీలోనూ విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. అయితే మనూషి ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకుల్ని పెద్దగా ప్రభావితం చేయలేకపోయినా, అందం, నటనతో మాత్రం కట్టిపడేసింది.
మనోళ్లు అక్కడ
ఈ ఏడాది బాలీవుడ్ భామలు టాలీవుడ్‌కు రావడమే కాకుండా, తెలుగు స్టార్ హీరోయిన్లు సైతం హిందీలో సత్తా చాటారు. అగ్ర కథానాయిన సమంత 'సిటాడెల్ హనీ బన్నీ' వెబ్‌సిరీస్‌తో హిందీలో మెరిసింది. రష్మిక, పూజా హెగ్డే, రకుల్‌ప్రీత్ సింగ్ హిందీలో కొత్త అవకాశాల్ని అందుకున్నారు. ఆ సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
రాశీఖన్నా 'యోధ', 'ది సబర్మతి రిపోర్ట్' సినిమాలో నటించగా, కీర్తిసురేశ్ 'బేబీ జాన్'తో ఈ ఏడాదే హిందీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అవుతోంది. ఇక మిల్క్ బ్యూటీ తమన్నా 'స్త్రీ2', 'వేదాన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో స్టెప్పులేసి ఆకట్టుకుంది. ఇక ఈ వరస చూస్తుంటే వచ్చే ఏడాది కూడా ఇక్కడి హీరోయిన్లు అక్కడ, అక్కడి నాయికలు ఇక్కడ నటించి ప్రేక్షకుల్ని అలరించే అవకాశాలున్నాయి.
2024 రౌండప్- స్టార్ హీరోలకు అదిరిపోయే హిట్స్- సక్సెస్ ట్రాక్ కంటిన్యూ!