Odisha Governor Kambhampati Hari Babu : మిజోరం గవర్నర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా కేంద్రప్రభుత్వం నియమించింది. ఆయన స్థానంలో కేంద్ర మాజీమంత్రి జనరల్ వీకే సింగ్ మిజోరం గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం 5 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. ముగ్గురిని ఒక రాష్ట్రం నుంచి మరోచోటకు బదిలీ చేయగా ఇద్దరిని కొత్తగా నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం రాత్రి పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా, విశాఖపట్నం ఎంపీగా పని చేసిన హరిబాబు 2021 నవంబరు 6న మిజోరం గవర్నర్‌గా నియమితులయ్యారు. సెప్టెంబరులో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో చికిత్స పొంది కోలుకున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన విధులకు హాజరుకాలేని పరిస్థితి ఉండటంతో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డికి కొన్నాళ్లు ఆ రాష్ట్ర అదనపు బాధ్యతలు అప్పగించారు. కంభంపాటి ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి మిజోరం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనే సరిహద్దు రాష్ట్రం ఒడిశాకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
Ajay Kumar Bhalla appointed as Governor of Manipur.
— ANI (@ANI) December 24, 2024
Dr Hari Babu Kambhampati, Governor of Mizoram appointed as Governor of Odisha. General (Dr) Vijay Kumar Singh, appointed as Governor of Mizoram. Rajendra Vishwanath Arlekar, Governor of Bihar appointed as Governor of Kerala.… pic.twitter.com/RgPVS5u68n
జనరల్ వీకే సింగ్ 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అందుకు బదులుగా ఇప్పుడు గవర్నర్ బాధ్యతలు కట్టబెట్టింది. మరోవైపు ప్రస్తుతం ఒడిశా గవర్నర్‌గా ఉన్న రఘుబర్‌దాస్ రాజీనామా చేశారు. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లాను మణిపుర్ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న అనసూయ ఉయికె పదవీకాలం ఈ ఏడాది జులై 30వ తేదీతో ముగియగా అప్పటి నుంచి ఆ బాధ్యతలను అస్సాం గవర్నర్ లక్ష్మణ్‌ప్రసాద్ ఆచార్య నిర్వర్తిస్తున్నారు. 2019 నుంచి 2024 ఆగస్టు వరకు సుదీర్ఘకాలం కేంద్రహోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన భల్లాకు మణిపుర్ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. మరోవైపు కేరళ గవర్నర్‌గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్‌ఖాన్‌ను బిహార్‌కు, అక్కడ గవర్నర్‌గా ఉన్న రాజేంద్రవిశ్వనాథ్ ఆర్లేకర్‌ను కేరళకు కేంద్రప్రభుత్వం బదిలీ చేసింది.