BPCL Greenfield Refinery in AP : కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. మొన్న ఆర్సెలార్ మిత్తల్, నిన్న రిలయన్స్, నేడు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇలా దిగ్గజ సంస్థలన్నీ రాష్ట్రానికి వచ్చేందుకు క్యూ కడుతున్నాయి. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి ఖరారైంది. రామాయపట్నంలో బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయించింది. దశల వారీగా రూ.95,000ల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
దేశంలో ఇప్పటికే ముంబయి, కొచ్చి, మధ్యప్రదేశ్‌లో రిఫైనరీలను ఏర్పాటు చేసిన బీపీసీఎల్ నాలుగోది ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది. రూ.6100 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ఏర్పాటు సంబంధించి ముందస్తు కార్యకలాపాలు చేపట్టడానికి సంస్థ పాలకమండలి సమావేశం మంగళవారం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి మంగళవారం రాసిన లేఖలో సంస్థ పేర్కొంది.
సెబీ రెగ్యులేషన్స్- 2015లోని 30వ నిబంధన ప్రకారం తూర్పు తీర ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కం పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించిన ముందస్తు కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆమోదం తెలిపామని బీపీసీఎల్ తెలిపింది. ఇందులో పలు అంశాలపై ప్రాథమిక అధ్యయనాలు, భూసేకరణ, డీపీఆర్ తయారీ, పర్యావరణ ప్రభావ మదింపు, ప్రాథమిక డిజైన్ ఇంజినీరింగ్ ప్యాకేజీ, ఫ్రంట్ ఎండ్ ఇంజినీరింగ్ డిజైన్ తదితరాలు ఉంటాయని పేర్కొంది. దీనిని పరిగణనలోకి తీసుకోవాలని ఎన్‌ఎస్‌ఈని కోరింది.
AP BPCL Investment : బీపీసీఎల్ లేఖను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వానికి ఇదో నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో రాష్ట్రం క్రమంగా ఊపందుకుంటూ అసమానమైన అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
గుజరాత్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా దాన్ని అధిగమించి బీపీసీఎల్‌ను రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రభుత్వం సఫలమైంది. సంస్థ ప్రతినిధి బృందం ప్రాజెక్టు ఏర్పాటుకు మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం ప్రాంతాలను పలు దఫాలు పరిశీలించింది. ఏపీ సర్కార్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత సమీపంలో పోర్టు, రిఫైనరీ ఏర్పాటుకు అందుబాటులో అవసరమైన భూములు ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని రామాయపట్నాన్ని అనువైన ప్రాంతంగా ఎంపిక చేసింది. నిర్మాణంలో ఉన్న రామాయపట్నం పోర్టులో రిఫైనరీ కోసం క్యాప్టివ్ విధానంలో బెర్త్‌ను కేటాయించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
బీపీసీఎల్ ప్రాజెక్టు కోసం సుమారు 5000ల ఎకరాలు అవసరమని సంస్థ ప్రతిపాదించింది. ఆ మేరకు భూసేకరణకు సుమారు రూ.1500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ముందస్తు కార్యకలాపాలకు ప్రతిపాదించిన రూ.6100 కోట్లలో భూసేకరణ ఖర్చుపోను మిగిలిన రూ.4600 కోట్లను ఇతర అవసరాల కోసం వెచ్చిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సుమారు లక్ష మందికి, పూర్తైన తర్వాత 5000ల మందికి శాశ్వత ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రాజెక్టు ఏర్పాటుపై బీపీసీఎల్‌తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అధికారులు తెలిపారు. మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీపీసీఎల్ ప్రస్తుతం తనకున్న మూడు రిఫైనరీల ద్వారా ఏటా ప్రపంచంలోని ఆరు ఖండాల నుంచి వచ్చే 96 రకాల చమురును దాదాపు 40 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర శుద్ధి చేస్తోంది.
ఏపీలో 85 వేల కోట్ల పెట్టుబడులు - 10 భారీ పరిశ్రమలకు లైన్ క్లియర్
రాష్ట్రంలో భారత్ ఫోర్జ్ పెట్టుబడులు - ప్రభుత్వానికి సంస్థ ప్రతిపాదన