INDUSTRIAL DEVELOPMENT : ఆర్థిక, పారిశ్రామిక ప్రగతి తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పారిశ్రామిక వేత్తలతో ఇప్పటికే సంప్రదింపులు కొనసాగుతుండగా, మరోవైపు కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రాబట్టేలా కసరత్తు జరుగుతోంది. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించేలా విశాఖలో ఐటీ, కోస్తా తీరంలో పారిశ్రామిక వాడలు, తిరుపతి సహా రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పనపై నూతన ప్రభుత్వం దృష్టి సారించింది.
రాష్ట్ర విభజన తొలినాళ్లలో అప్పటి టీడీపీ ప్రభుత్వం పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరిచింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో హెచ్సీఎల్ (HCL) నుంచి మేధా టవర్స్, ఆటోనగర్‌లో సాఫ్ట్‌వేర్ టవర్స్, మల్లవల్లి, వీరపనేనిగూడెంలో భారీ పరిశ్రమలకు వందల ఎకరాలు కేటాయించింది. ఐటీ, స్టార్టప్ కంపెనీలకు అనేక ప్రోత్సాహకాలు కల్పించడంతోపాటు మౌలిక వసతులు, భవనాల ఏర్పాటుపైనా ప్రత్యేకంగా దృష్టిసారించింది. కొండలు, గుట్టలను చదునుచేసి పారిశ్రామికవాడలుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ఆరంభం కాగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మోకాలడ్డారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇచ్చిన భూములను కొల్లగొట్టేశారు.
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మల్లవల్లి పారిశ్రామికవాడపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ అశోక్ లే ల్యాండ్ యూనిట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినా ప్రారంభించని దుస్థితి ఏర్పడింది. పార్లే ఆగ్రో పరిశ్రమ పనులు మధ్యలోనే నిలిచిపోగా పారిశ్రామిక వేత్తలు చేతులెత్తేశారు. చంద్రబాబు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలు మూతపడేలా చేయడంలో వైఎస్సార్సీపీ సర్కారు విజయవంతమైంది.
పరిశ్రమ వర్గాలు ఏం కోరుకుంటున్నాయి? ప్రభుత్వం ఏం ఆశిస్తోంది? - PRATIDWANI ON Grabbing Investments