CM Chandrababu on Flood Damage Enumeration :భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, అనిత, అనగాని సత్యప్రసాద్ సహా అధికారులు హాజరయ్యారు. ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. ఎన్యుమరేషన్ పక్కాగా జరగాలని, నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సాయం చేరాలని అన్నారు.
సహాయ చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, పరిహారం విషయంలో శాస్త్రీయంగా ఆలోచన చేసి జాబితా రూపొందించాలని సీఎం అన్నారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే, 17వ తేదీ బాధితులకు సాయం అందిద్దామని సీఎం పేర్కొన్నారు. ఎన్యుమరేషన్ జరుపుతున్న విధానాన్ని, వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇల్లు పూర్తిగా మునిగి ఆస్తినష్టం జరిగిన వారితో పాటు, మొదటి ఫ్లోర్లో ఉన్నవారికి సైతం సాయం ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
వరద కారణంగా ఇంట్లో వస్తువులు అన్నీ పాడైపోయిన మొదటి అంతస్తువారికి ఒక మొత్తం, రెండో ఫ్లోర్ నుంచి ఆ పైన ఉన్నవాళ్లకి కొంత మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అలాగే దెబ్బతిన్న ద్విచక్రవాహనాలకు కూడా పరిహారం ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. పూర్తిగా ఇల్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆర్థిక సాయం పై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది.