CM Chandrababu on Polavaram Project :కేంద్ర కేబినెట్ నిర్ణయాలు నిరాశ నిస్పృహల్లో ఉండే రాష్ట్రానికి మంచి భరోసా ఇస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి, జలశక్తి మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం ఆమోదించిన పారిశ్రామిక హబ్‌ల వల్ల రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు.
ఎప్పుడూ పోలవరం పనులు ఆపలేదు :పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమలకు సంబంధించి రెండు నోట్స్‌ను కేంద్రం క్లియర్ చేసిందని, కేంద్రం చర్యలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం కలుగుతోందని చంద్రబాబు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఏర్పాటు చేశారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా రూ.15,146 కోట్లు ఇవ్వాలని, కేంద్రం ఇవ్వలేదని ఎప్పుడూ పోలవరం పనులు ఆపలేదని అన్నారు.
పోలవరంపై కేంద్రం ఫోకస్ - ప్రాజెక్టుకు అవసరమైన నిధులకు కేబినెట్ ఆమోదం! - Central Funds for Polavaram
72 శాతం పని పూర్తి చేశాం :పోలవరం అంటే ప్రజలకు సెంటిమెంట్ అని చంద్రబాబు వెల్లడించారు. గోదావరి, కృష్ణా నదుల్లో నీరున్నా కొంత వృధాగా సముద్రంలోకి పోతోందన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు ఇబ్బందులకు గురి అయ్యిందని ఆక్షేపించారు. విభజన సమయంలో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా ముంపు మండలాలు ఏపీకి ఇవ్వలేదని, 28 సార్లు క్షేత్ర స్థాయికి వెళ్లా, 82 సార్లు వర్చువల్‌గా సమీక్ష చేసానని గుర్తు చేశారు. 2019 వరకూ 72 శాతం పని పూర్తి చేశాం , కాంక్రీటు పనులు, డయాఫ్రమ్ వాల్ పనులు, స్పిల్ వే, కాఫర్ డ్యాంలు కూడా నిర్మించామన్నారు. 4వేల114 కోట్లను అప్పటికి పునరావాసం కోసం ఖర్చు చేశామని చంద్రబాబు వివరించారు.
జగన్ ప్రమాణ స్వీకారం రోజే పనులు ఆగిపోయాయి : 2019 తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ఆ ప్రాజెక్టు పాలిట శనిలా దాపురించిందని సీఎం ధ్వజమెత్తారు. పండగ పూట కూడా ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి గడ్కారీ వద్దకు వెళ్ళానని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయవాదుల తరహాలో ఆ ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం వద్ద వాదించానన్నారు. ప్రజా స్వామ్యంలో మార్పుల వల్ల 2019లో ప్రమాణం స్వీకారం చేసిన తొలి రోజే ప్రాజెక్టు పనులు నిలిచిపోయిందని వాపోయారు. అధికారులను, కాంట్రాక్టర్లను అక్కడి నుంచి తరిమేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు కొన్నాళ్ళు అనాథగా నిలిచి పోయిందని ఆక్షేపించారు. రివర్స్ టెండర్ అమలు చేసి పైశాచిక ఆనందం పొందారని వ్యాఖ్యానించారు. వరదలు వచ్చి డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాంలు దెబ్బ తిన్నాయని వాపోయారు.