TDP Parliamentary Party Meeting :పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఇచ్చిన రూ.12,150 కోట్లతో శరవేగంగా పనులు పూర్తిచేసి రైతులకు ఫలాలు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం పూర్తి చేశాకే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ అవుతుందన్న సీఎం, కేంద్ర సాయం కోసం ఎంపీలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం లభించేలా చూడాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక రాజధాని అమరావతిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకి ఈ ఐదేళ్లలో కచ్చితంగా శంకుస్థాపన చేసేలా ఎంపీలు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రానికి కొత్త రోడ్లు వచ్చేలా చొరవ తీసుకోవాలని సీఎం సూచించారు. రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయించేలా చూడాలని చంద్రబాబు వివరించారు.
Chandrababu on TDP MPs : కేంద్ర పథకాలు రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అధ్యయనం చేసి రాష్ట్రంలోని సంబంధిత శాఖా మంత్రులకు తెలపాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి, ఎంపీ, కలెక్టర్, ఎస్పీలు ఒక బృందంగా సమన్వయంతో పనిచేయాలన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలకు పూర్తి హాజరు ఉండాలని, మిగతా సమయాల్లో నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు.