CM Chandrababu on Telugu Film Industry: తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన అవకాశాల వల్లే సినిమాలకు ఇప్పుడు హైదరాబాద్ హబ్‌గా మారిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగిందని అన్నారు. అమరావతి నిర్మాణం పూర్తైతే సినిమాలన్నీ ఇక ఏపీలోనేనని అన్నారు. అమరావతిలో సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందని వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు వివిధ అంశాలపై మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అమరావతి నగరం భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందే నగరమని స్పష్టం చేశారు.
వారిని మాత్రం వదిలేది లేదు:పార్టీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వస్తే వారికి సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ, ప్రజలకు జవాబుదారీలా ఉండేలా కంట్రోల్ చేస్తున్నానని సీఎం వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో ఎవ్వరూ తప్పుడు పోస్టులు పెట్టకుండా చాలావరకూ నియంత్రించగలిగామని చెప్పారు. ఇంకా సమీక్షించుకుని ప్రజలకు ఏది మేలో అదే చేస్తామని స్పష్టం చేశారు. కొన్ని అంశాల్లో శ్రేణుల అభిప్రాయాలు, తన అభిప్రాయాలకు తేడా ఉంటోందని అన్నారు. సమాజానికి హానికరమైన వారిని మాత్రం వదిలేది లేదని తేల్చిచెప్పారు. 1995లో ఫ్యాక్షనిజం, రౌడీయిజం, మతకలహాలను అణచివేసినట్లే ఇప్పుడూ పని చేస్తానని స్పష్టం చేశారు. జగన్ లాగా తాము తప్పులు చేస్తే ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారని వ్యాఖ్యానించారు.
సూపర్ 6 హామీలు నెరవేర్చేందుకు కృషి: అమరావతి, పోలవరంతో పాటు అనేక వ్యవస్థలను జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు గత 6 నెలలుగా శ్రమిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని కోలుకునేలా చేయటంతో పాటు సూపర్ 6 హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజల ఆకాంక్షలు కూడా పెరిగాయన్న చంద్రబాబు అన్ని రాత్రికి రాత్రే జరిగిపోవాలి అంటే సాధ్యం కాదు అనేది అందరూ గ్రహించాలన్నారు. ఆర్థిక పరిస్థితిని గాడిని పెట్టి అందరి సమస్యలూ పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలు అన్నీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
2024 చరిత్ర తిరగరాసింది - అందరికీ భవిష్యత్‌పై భరోసా వచ్చింది: సీఎం చంద్రబాబు