CM Chandrababu on Revenue Issues :వైఎస్సార్సీపీ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల్లో భయం పట్టుకుందని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు భూ వ్యవహారాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేసి దందాలు చేశారని మండిపడ్డారు. కడప, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భూ అక్రమాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 లక్షల ఎకరాలకు పైగా ఫ్రీ హోల్డ్ భూముల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తీసుకువచ్చామని సీఎం స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో జరిగిన అవకతవకలన్నీ సరి చేయాల్సి ఉందని వెల్లడించారు.
జగనన్న కాలనీల్లో అనర్హులకు ఇచ్చిన ఇళ్లస్థలాల విషయంపై రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ విచారణ చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అంశాలకు సంబంధించి పోలీసులకు వచ్చే ఫిర్యాదులపై జాయింట్ టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాలని సూచించారు. భూ అక్రమాలకు సంబంధించి లాగిన్ వివరాలను సైబర్ నిపుణుల ద్వారా తెలుసుకుని సంబంధిత వ్యక్తులపై కేసులు పెట్టాలని ఆదేశించారు. భూ ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తే తప్ప భవిష్యత్తులో ఈ తరహా నేరాలు తగ్గవన్నారు. అంతిమంగా ప్రజలు మెచ్చుకునేలా కలెక్టర్లు వ్యవహరించాలని పేర్కొన్నారు.
భూ ఆక్రమణలు చేస్తే పీడీ యాక్ట్:రాష్ట్రంలో భూ కబ్జాలు జరగకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువచ్చామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వెల్లడించారు. భూ ఆక్రమణల లాంటి వాటిని నేరంగా పరిగణిస్తూ నిందితులపై పీడీ యాక్ట్ పెట్టేలా చర్యలు చేపట్టామని వివరించారు. రీసర్వేలో చాలా పొరపాట్లు దొర్లాయని వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. భూహక్కు పత్రాల్లో పార్టీలు, వ్యక్తుల ఫొటోలు లేకుండా ప్రభుత్వ అధికారిక ముద్రమాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. 2,444 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ జరిగితే 41 వేల వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని వీటి పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు - 8వేల కోట్ల నిధులకు ఏడీబీ ఆమోదం