Chandrababu on Swachh Andhra Pradesh : ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఈరోజు నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులకు ఆదేశాలిచ్చారు. భవిష్యత్‌లో రోడ్లపై చెత్త ఉండకూడదని ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశే ధ్యేయంగా ముందుకెళ్లాలని 2029కల్లా అది కావాలని వివరించారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.
రహదారిని శుభ్రంచేసిన చంద్రబాబు : అంతకుముందు చంద్రబాబు చీపురు పట్టుకుని రహదారిని శుభ్రం చేశారు. ఆ తర్వాత పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. వారితో కలిసి టీ తాగారు. వృత్తిపరమైన సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత డంపింగ్ యార్డును సీఎం పరిశీలించారు. రోడ్డు పక్కన ఫుట్ పాత్‌కు రంగులద్దారు. అంతకుముందు నేషనల్ కాలేజీ ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహానికి చంద్రబాబు నివాళులు అర్పించారు.
పింగళి వెంకయ్య పేరును మచిలీపట్నం మెడికల్ కాలేజీకి పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నేడు మహాత్మాగాంధీ సేవలను గుర్తు చేసుకుని నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. ఆయన స్పూర్తితో స్వచ్ఛత కార్యక్రమానికి అందరూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మన ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమేనని వ్యాఖ్యానించారు. గతంలో క్లీన్ అండ్ గ్రీన్ పెట్టి నెలలో రెండో శనివారం అందరూ పాల్గొనేలా చేశామని చంద్రబాబు గుర్తుచేశారు.
"చెట్లు నరికేయడం, చెత్త రోడ్ల మీద వేయడం వంటివి ఇటీవల చూశాం. ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్‌కు శ్రీకారం చుట్టారు. దీనికి అందరం ఆయనకు అభినందనలు చెప్పాలి. నీతి ఆయోగ్‌లో స్వచ్ఛభారత్‌పై ఉపసంఘం ఏర్పాటు చేశారు. దీనికి నేను ఛైర్మన్‌గా ఉన్నాను. స్వచ్ఛ సేవకులను గుర్తించి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. 2019 నుంచి మన రాష్ట్రంలో చెత్త పేరుకు పోయింది. టీడీపీ ప్రభుత్వంలో చెత్త నుంచి కరెంట్‌ను తయారు చేసి సంపదను సృష్టించే కార్యక్రమం చేశాం. స్వచ్చాంధ్రప్రదేశ్ స్పూర్తితో మా ప్రభుత్వం ముందుకు వెళ్లింది." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
'విజయవాడ వరదలప్పుడు పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు చాలా గొప్పవి. బుడమేరు గండ్లు పూడ్చకుండా గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు వచ్చింది. తద్వారా విజయవాడ మొత్తం అతలాకుతలమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆరేడు అడుగుల నీరు రోడ్లపైనా, ఇళ్లల్లో నిలిచింది. వరద నీరు పోయే పరిస్థితి లేక పైనుంచి వస్తున్న నీటితో తల్లడిల్లాం. వరద బాధితులను ఆదుకునేందుకు తీవ్రంగా శ్రమించాం. లక్షలాది మంది ప్రజలకు అవసరమైన సేవలు అందించా' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.