symbol of destruction : రాష్ట్రంపై పగబట్టారా? అన్నట్లుగా ప్రజావేదిక విధ్వంసంతో మొదలైన జగన్ పాలన అన్నిరంగాల్లోనూ రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రతి నిర్ణయం ఏపీ భవిష్యత్‌కు పెనుశాపంలా పరిణమించింది. రాష్ట్రానికి రెండు కళ్లలాంటి అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకం కాగా, ఏపీలో అపారంగా లభించే ఇసుక అధికార పార్టీ పెద్దలకు 'బంగారు బాతు'లా మారింది. గ్రావెల్ మాఫియా దెబ్బకు ఎన్నో కొండలు కరిగిపోయాయి. ఐదేళ్ల అరాచకాలకు చరమగీతం పాడుతూ కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ప్రపంచ యుద్ధాల్లో అణుబాంబు దాడికి గురై ఇప్పటికీ కోలుకోలేకపోయిన హిరోషిమా, నాగసాకిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా వేదికను జగన్ విధ్వంసానికి గుర్తుగా అలాగే ఉంచుతామని ప్రకటించారు.
2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. అప్పటికి రాజధాని లేదు. ఆదాయ వనరులూ అంతంత మాత్రమే. "చుట్టూ కంప చెట్లు, నేలంతా రాతి బండలు, జాడలేని నీటి ఆనవాళ్లు!" అలాంటి పరిస్థితుల్లో సేద్యం (పాలన) బాధ్యతను భుజానికెత్తుకున్నారు చంద్రబాబు. ముందుగా రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు వేశారు. రైతుల సహకారంతో దాదాపు 55వేల ఎకరాల భూమిని రాజధాని కోసం సేకరించారు. ప్రగతి పట్టాలెక్కుతున్న తరుణంలో వచ్చిన ఎన్నికలు ఏపీ భవిష్యత్‌ను మలుపు తిప్పాయి. వరల్డ్ టాప్ టెన్ సిటీ జాబితాలోకి ఎక్కుతుందనుకున్న అమరావతి నగరం నిర్మాణానికి ఆశనిపాతంలా మారాయి.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2017 నవంబర్‌లో ప్రజా వేదికను అందుబాటులోకి తెచ్చారు. సుమారు 500మంది పట్టేలా, కలెక్టర్ల కాన్ఫరెన్స్, ఇతర సమీక్షలు బహుళ ప్రయోజనాలకు వీలుగా నిర్మించిన ప్రజావేదిక భవనం నిర్మించారు. తన నివాసానికి పక్కనే సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగించుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సీఎం పీఠం దిగిపోయిన చంద్రబాబు ప్రజావేదికను ప్రతిపక్ష నేతగా తనకు కేటాయించాలని కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. తన అధికారిక కార్యకలాపాలకు, ఎమ్మెల్యేలు, సందర్శకులు తనను కలిసేందుకు వీలుగా భవనాన్ని వినియోగించుకునే వెసులుబాటు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. లేఖ రాసి రెండు వారాలు దాటినా ప్రభుత్వం స్పందించలేదు.