Nellore Horticulture Officer On Bamboo Cultivation: రైతులను వెదురు సాగు వైపు మళ్లించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయని నెల్లూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ వెదురు మిషన్ పథకం కింద రైతులకు రాయితీలు అందిస్తున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా రైతులకు రెండు హెక్టార్ల వరకు రాయితీని ఇస్తుందన్నారు. హెక్టార్‌కు దాదాపు 50 వేల రూపాయల వరకు రాయితీ ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
నర్సరీలకు 50 శాతం రాయితీ: వెదురు నర్సరీలు ఏర్పాటు చేసుకునే రైతులకు, నిరుద్యోగ యువతకు యూనిట్ విలువ 10 లక్షల రూపాయలు. అందులో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. నీటి వసతుల్లేని ప్రాంతాల్లో ఈ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన వ్యవసాయ పరిశోధన స్థానాలలో, మున్సిపాలిటీలలో, పంచాయతీల్లో ఉచితంగా వెదురు మొక్కలు ఇవ్వటం జరుగుతుందని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా మార్కెటింగ్ సదుపాయం సైతం ప్రభుత్వం కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
వెదురు వలన కలిగే ప్రయోజనాలు: థర్మల్ విద్యుత్కేంద్రాల్లో వెదురు గుళికలు వినియోగించాలంటే వెదురు బొంగులు అవసరం. దీనికి బయట మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల రాయితీలను కల్పిస్తున్నాయి. వెదురు సాగు విస్తీర్ణం ఆధారంగా ఈ రాయితీని అందించనున్నారు. లక్ష ఎకరాల్లో వెదురు సాగు చేస్తే విద్యుత్కేంద్రాలకు అవసరమైన వెదురు లభిస్తుందని ప్రభుత్వానికి పలు నివేదికలు సూచించాయి. అందుకు గాను ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక చొరవ చూపుతుండటం గమనార్హం.
''వెదురు నర్సరీలు ఏర్పాటు చేసుకునే రైతులకు, నిరుద్యోగ యువతకు యూనిట్ విలువ 10 లక్షల రూపాయలైతే అందులో 50 శాతాన్ని రాయితీగా ఇస్తాం. నీటి వసతుల్లేని ప్రాంతాల్లో ఈ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన వ్యవసాయ పరిశోధనాలయాల్లో, మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో ఉచితంగా వెదురు మొక్కలు ఇవ్వటం జరుగుతుంది'' -సుబ్బారెడ్డి , నెల్లూరు జిల్లా ఉద్యాన అధికారి