Kishan Reddy on Congress Guarantees to Women : అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళలకు అనేక హమీలు ఇచ్చి మాట తప్పిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి దేవుళ్ల మీద ఒట్లు పెట్టి తప్పించుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తుండగా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీని పక్కన పెట్టుకుని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎక్కడికిపోయాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇస్తామన్నారు, రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. 18ఏళ్లు నిండిన మహిళలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు, వివాహం చేసుకునే మహిళలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని ధ్వజమెత్తారు.
'వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారు? ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నా మహిళలకు న్యాయం జరగలేదు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాం. నరేంద్ర మోదీ మహిళలకు 33శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారు. అమలు చేయలేని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి బస్సులు తగ్గించారు. తెలంగాణ ఆడబిడ్డల తరఫున ప్రశ్నించే బాధ్యత మేము తీసుకున్నాం. హామీల అమలు కోసం సీఎంపై ఒత్తిడి తెస్తాం.' అని కిషన్ రెడ్డి అన్నారు.