CAG Report on AP Economic Statistics : 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ఆర్థిక గణాంకాలపై కాగ్ నివేదిక ఇచ్చింది. రాబడులు - వ్యయాలకు సంబంధించిన అంశాలపై ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నివేదిక ఇచ్చింది. పథకాల అమలు కోసం కేంద్రం బదలాయించిన రూ 15,771 కోట్ల రూపాయలు వార్షిక ఖాతాల్లో ప్రతిఫలించలేదని కాగ్ పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.48,728 కోట్ల రూపాయల రుణాలు తీసుకోవాలని అంచనా వేస్తే రాష్ట్రప్రభుత్వం రూ.52,508 కోట్ల రుణం తీసుకుందని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం స్పష్టం చేసింది. అసెంబ్లీ ఆమోదించిన మొత్తం కంటే అదనంగా రూ. 4,027 కోట్లను ఖర్చు చేసేశారని స్పష్టం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 341 రోజుల పాటు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులను ఏపీ వినియోగించుకుందని పీఏజీ వెల్లడించింది. రిజర్వు బ్యాంకు ఖాతాలో రూ.1.94 కోట్ల కంటే తక్కువ నిల్వల కారణంగా ఏడాదిలో 1,18,039 కోట్లను వేస్ అండ్ మీన్స్ గా వాడుకున్నట్టు వెల్లడించింది.
ఇదే ఆర్థిక సంవత్సరంలో 152 రోజుల పాటు ఏపీ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వాడుకుందని వెల్లడించింది. మొత్తం 57,066 కోట్ల మేర ఓవర్ డ్రాఫ్ట్ ఏపీ వాడుకున్నట్టు నివేదికలో పీఏజీ పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 73 మార్లు బహిరంగ మార్కెట్ ద్వారా 57,478 కోట్ల మేర ఏపీ అప్పు తెచ్చిందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ఏడాదిలో 8,411 కోట్ల మేర ఏపీ అప్పు తెచ్చిందని పీఏజీ (ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్) వెల్లడించింది. మూలధన వ్యయం కేవలం రూ.7244 కోట్లకు మాత్రమే పరిమితమైందని స్పష్టం చేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూలధన వ్యయం కేవలం 0.55 శాతం మాత్రమే అని పీఏజీ వెల్లడించింది. వివిధ కార్పోరేషన్లు రుణం తీసుకునేందుకు ప్రభుత్వ హామీలు రూ.1,38,875 కోట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ పేర్కొంది.