BRS Working President KTR On Election Results : లోక్సభ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ పరిచాయని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ఫీనిక్స్ పక్షి తరహాలో మళ్లీ పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశామని గుర్తు చేశారు.
KTR On Election Results :అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉందన్న కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటాన్ని మించిన గౌరవం, విజయం మరేది లేదని తెలిపారు. గతంలోనూ ఇలాంటి ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ ప్రజాదరణతో బీఆర్ఎస్ పుంజుకున్న సందర్భాలెన్నో ఉన్నాయని అన్నారు. తెలంగాణ సాధించటంతో పాటు ఒక ప్రాంతీయ పార్టీగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని, 2014లో 63 సీట్లు, 2018లో 88 సీట్లలో గెలుపొందామని పేర్కొన్నారు.
అందరికీ కృతజ్ఞతలు :ప్రస్తుత శాసనసభలోనూ మూడో వంతైన 39 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కొనసాగుతోందని, స్వల్ప తేడాతోనే ఓటమి పాలైందని వివరించారు. ఆర్నెళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు నిరాశ కలిగించినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమించారన్న కేటీఆర్, వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని, గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడినప్పుడు కుంగిపోవద్దని అధినేత కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారని అన్నారు.
బీఆర్ఎస్ అదే సిద్ధాంతాన్ని పాటిస్తుందని తెలిపారు. ఇప్పుడు వచ్చిన ఫలితాలు కచ్చితంగా నిరాశ పరిచాయని, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కుంగిపోయేది లేదని కేటీఆర్ తెలిపారు. ఎప్పటిలాగే ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని, ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి వారి బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటామని చెప్పారు.