KTR Responded to State Women Commission Notices : ఈనెల 24న రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అన్ని ఘటనల వివరాలు కమిషన్‌కు తెలియజేస్తానని చెప్పారు. తాను బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చారన్నారు.
తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను సీఎం, కాంగ్రెస్ నేతలు అన్న మాటలను కూడా మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు కేటీఆర్ చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న తెలంగాణ మహిళా కమిషన్ శుక్రవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా కమిషన్ ముందు అటెండ్ అవ్వాలని సూచించింది. ఈ మేరకు కమిషన్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించింది.
రుణమాఫీ కోసం ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టి పోరాటాలు చేస్తాం : మరోవైపు రుణమాఫీ కోసం మాట్లాడిన మాజీమంత్రి కేటీఆర్, రుణమాఫీ డొల్లగా తేలిపోయిందని ఎల్లుండి నుంచి క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తామని తెలిపారు. రుణమాఫీ కాని వివరాలు సేకరించి కలెక్టర్, అధికారులకు అందిస్తామని ప్రభుత్వం అప్పటికీ న్యాయం చేయకపోతే ప్రభుత్వ పెద్దలు, ముఖ్యులకు వివరాలు అందిస్తామని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ వెల్లడించారు.