KTR Reacts On Patnam Narender Reddy Arrest : వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కనీసం కుటుంబానికి సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా, ఎలా తీసుకెళ్తారని అధికారులను ఆయన నిలదీశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. కిడ్నాపర్లలా వచ్చి తీసుకెళ్లే దానిని అరెస్ట్ అంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వ అనాలోచిన నిర్ణయాల వల్ల ప్రజలు ఆగమవుతున్నారని, రైతుల ఆక్రందనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తోంది :ఫార్మాసిటీ కోసం కేసీఆర్ హయాంలో ఎనిమిదేళ్లు కష్టపడి 14 వేల ఎకరాలు సేకరించామని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా రేవంత్ రెడ్డి తుగ్లక్ లాగా ఫార్మాసిటీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని ఆరోపించారు. తిరిగి నెల రోజుల్లోనే మనసు మార్చుకొని ఫార్మాసిటీ కుదిస్తామని చెప్పారన్నారు. సీఎం అనాలోచిత చర్యల వల్లే కొడంగల్, న్యాలకల్‌లో రైతులు ఆందోళన చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రైతులు జైల్లో ఉంటే కొడంగల్ ఎమ్మెల్యే నీరో చక్రవర్తి లాగా వ్యవహరిస్తూ దిల్లీ పెద్దలకు మూటలు మోస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడ్డారు.