BRS Leader KTR Comments on Congress Govt :జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అడ్డుపెట్టుకుని కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసి, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందిన కాంగ్రెస్, మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయాలంటే అహం అడ్డొస్తోందని విమర్శించారు. ఈ మేరకు హైదారాబాద్‌లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
2022లో మేడిగడ్డ ఆనకట్టపై నుంచి నీరు వెళ్లినా తట్టుకున్న విషయాన్ని విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ నేతలే కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైనా చేశారేమో అనే అనుమానం కలుగుతోందని కేటీఆర్ ఆక్షేపించారు. నిర్వహణ లోపం ఉంటే అక్కడ ఒక్క చోటే ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఏదో కుట్ర జరిగిందన్నదే తన వ్యక్తిగత అనుమానంగా పేర్కొన్నారు.
ఎన్డీఎస్ఏ నివేదిక కాదు - బీజేపీ కార్యాలయంలో సిద్ధమైన నివేదిక : తమను ఓడగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారేమోనని అనుమానం వ్యక్తం చేసిన కేటీఆర్, రేపు ప్రాజెక్టుకు ఏదైనా జరిగితే, ప్రస్తుత ప్రభుత్వానిదే బాధ్యతని తేల్చిచెప్పారు. అన్ని విషయాల్లో బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్, ఎన్డీఎస్ఏ విషయంలో ఎందుకు ఏకీభవిస్తోందని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ నివేదిక కాదని, బీజేపీ కార్యాలయంలో సిద్ధమైన నివేదికగా పేర్కొన్నారు.
శ్రీపాద ఎల్లంపల్లిలో ఇప్పుడు నడిపిస్తున్న పంపులను కేసీఆర్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని గుర్తు చేసిన కేటీఆర్, ఎల్లంపల్లి నీరు సరిపోదని, కన్నెపల్లి నుంచి ఎత్తిపోయడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ద్వారా ఒక పంటకు 36 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉందన్న మాజీ మంత్రి, ఇప్పటికైనా నీటిని రైతుల పొలాలకు మళ్లించాలని సూచించారు.