BRS Strategy on MP Elections :శాసనసభ ఎన్నికల ఓటమిని అధిగమించిన లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి కసరత్తు చేస్తోంది. గతంలోనే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి గులాబీ పార్టీ(TRS Party), దాదాపు 60 నియోజకవర్గాలకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలోనూ విస్తృత స్థాయి భేటీలు పూర్తి చేసింది. తాజాగా లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థిత్వాల ప్రకటన పూర్తి చేసింది. ఆయా నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనేతలతో చర్చించిన అధినేత కేసీఆర్(KCR) అభ్యర్థులను ప్రకటించారు. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం కల్పించిన బీఆర్ఎస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ప్రజాప్రతినిధులు, కొత్త వారికి టికెట్లు ఇచ్చింది.
ప్రచారానికి శ్రీకారం : అభ్యర్థిత్వాల ప్రకటనతో కొందరు ఇప్పటికే వారి నియోజకవర్గాల పరిధిలో సమావేశాలు, ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దశల వారీగా ఎన్నికల కార్యాచరణ అమలు చేసేందుకు గులాబీ నాయకత్వం సిద్ధమైంది. ముందుగా లోక్‌సభ నియోజకవర్గాలు, శాసనసభ నియోజకవర్గాల వారీగా ముఖ్యనేతల సమావేశాలు నిర్వహించనుంది. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సమావేశం జరగింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ఈ సమావేశంలో పాల్గొన్నారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల సమావేశాలు కూడా తెలంగాణ భవన్‌లోనే నిర్వహించనున్నారు.
మండలాల వారీగా సమావేశాలు : మిగిలిన నియోజకవర్గాల సమావేశాలు జిల్లాల్లో నిర్వహించి ముఖ్యనేతలు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. శాసనసభ నియోజవర్గాల వారీగా కూడా ముఖ్యనేతల సమావేశం నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, తాజా మాజీలతో పాటు ముఖ్యనేతలు సమావేశాలకు హాజరవుతారు. రాష్ట్ర పార్టీ తరపున కూడా కొందరు నేతలు సమావేశాలకు వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాతి దశలో మండలాల వారీగా కూడా సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థులతో పాటు మండలాల వారీగా బృందాలు సమావేశాలకు హాజరయ్యేలా ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత ముఖ్యనేతలు విస్తృత ప్రచారం చేయనున్నారు.