Harish Rao Complaint Against CM For Violating of Assembly Rights : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రభుత్వం డిఫెన్స్‌లో పడగానే ఏదో ఒక కాగితం తీసుకొచ్చి చర్చను పక్కదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అసెంబ్లీ లాబీలో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇప్పటి వరకు జరిగిన మూడు సమావేశాల్లోనూ తప్పుదోవ పట్టించారని హరీశ్‌రావు వివరించారు.
గతంలో గోదావరి జలాల విశ్రాంత ఇంజినీర్ల నివేదికను ప్రస్తావించిన సీఎం, ఉద్దేశపూర్వకంగా తనకు అవసరం ఉన్న వాటిని మాత్రమే చదివి కొన్ని పదాలను విస్మరించారని పేర్కొన్నారు. విద్యుత్ మీటర్ల విషయంలో సీఎం కావాలనే మూడు పదాలను ఎగ్గొట్టి చదివారని, మందబలంతో ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
పదవుల కోసం పాకులాడేది రేవంత్‌రెడ్డే, మేము కాదు :విద్యుత్ మీటర్లు పెట్టడానికి అంగీకరించారని సీఎం తప్పుదోవ పట్టించారని అన్నారు. ఇవాళ పోతిరెడ్డిపాడు విషయంలో కూడా తప్పుదోవ పట్టించారని, పదవుల కోసం పెదవులు మూశారని తమనుద్దేశించి రేవంత్‌రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. దగ్గరుండి పులిచింతల కట్టించిన నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న హరీశ్‌రావు, తెలంగాణ ప్రయోజనాల కోసమే నాడు వైఎస్ మంత్రివర్గం నుంచి తప్పుకొన్నట్లు వివరించారు.
2005 జూలై ఐదో తేదీన తాము మంత్రి పదవులను గడ్డిపోచల్లా వదులుకున్నామని, 2005 డిసెంబర్లో పోతిరెడ్డిపాడు విస్తరణ జీఓ వచ్చిందని అన్నారు. మంత్రి పదవుల్లో కొనసాగాలని కేసీఆర్‌తో సోనియాగాంధీ మాట్లాడినా వెనక్కు తగ్గలేదని చెప్పారు. పదవుల కోసం పాకులాడేది రేవంత్‌రెడ్డి తప్ప తాము కాదని, ఆయనది దబాయింపు తప్ప ఎలాంటి వాస్తవాలు లేవని అన్నారు.
నిజాయితీ ఉంటే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలి :ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైకోర్టును ఆశ్రయించారని, ఎల్ఆర్ఎస్పై డబ్బులు వసూలు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని ఎద్దేవా చేశారు. నిజాయతీ ఉంటే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని అసెంబ్లీలో డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. అసెంబ్లీలో అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని, రేవంత్‌రెడ్డి తనకు తాను తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకునే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ దీక్ష చేయకపోయి ఉంటే తెలంగాణ వచ్చేదా అన్న ఆయన, కేసీఆర్ దీక్ష కారణంగానే రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి వచ్చిందని తెలిపారు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో రేవంత్‌రెడ్డి ఏనాడూ మాట్లాడలేదని, ఒక్క రోజైనా జై తెలంగాణ అన్నారా, ఒక్క రోజైనా ఉద్యమం చేశారా? అని ప్రశ్నించారు. అమరవీరులను కించపరిచేలా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.