Ex Minister Prashanth Reddy On Rajiv Gandhi Statue Issue : కాంగ్రెస్ అధిష్ఠానం మెప్పు కోసం హడావుడిగా సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆక్షేపించింది. తెలంగాణ ఏర్పాటుకు సంబంధం లేని రాజీవ్ విగ్రహం పెట్టడం శోచనీయమని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి గుడి కట్టాలని అప్పట్లో కేసీఆర్ నిర్ణయించినట్లు ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ ఆత్మ లింక్‌ను తెగ్గొట్టిన ఘనత రేవంత్‌రెడ్డికే : తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రణాళిక చేశామన్నా ఆయన, ఆలయంలో దేవతలాగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకున్నామని అన్నారు. ఈ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో తెలంగాణ ఆత్మ లింక్‌ను తెగ్గొట్టిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందని ఆయన ఆరోపించారు. ఉద్యమంలో ఉంటే రేవంత్‌కు తెలంగాణ ఆత్మ అర్ధమయ్యేదని ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.
హామీలు, గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే విగ్రహ ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ సర్కార్‌పై ప్రజలు కసి తీర్చుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతంలో రాజీవ్ విగ్రహాన్ని పెట్టడాన్ని ఖండిస్తున్నామన్న మాజీ మంత్రి, అధికారంలోకి బీఆర్ఎస్ రాగానే తెలంగాణ తల్లి గౌరవాన్నిపెంచేలా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
"సచివాలయం, అమరజ్యోతి మధ్య తెలంగాణ ఏర్పాటుకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం శోచనీయం. తెలంగాణ తల్లిని అవమానించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మెప్పు పొందేందుకు రేవంత్ ఆతృత పడుతున్నారు. కేవలం దిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ ఆత్మను తాకట్టు పెడుతున్నారు. తెలంగాణ ఆత్మను గౌరవించి, తెలంగాణ తల్లిని పూజించే వ్యక్తిగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని గతంలో కేసీఆర్ ప్లాన్ చేశారు. కానీ నేడు తెలంగాణ ఆత్మ లింక్‌ను రేవంత్ రెడ్డి కట్ చేశారు."-వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి
Prasanth Reddy Fires On CM Revanth : గొప్పగా అమరులను స్మరించుకునేలా నభూతో నభవిష్యత్ అన్నట్లుగా.. ప్రపంచంలో అతి అరుదైన కట్టడంగా ఉండేలా అమరజ్యోతిని కేసీఆర్ నిర్మించారని, ప్రారంభోత్సవమై ఏడాది దాటినా సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం లేదని ఆక్షేపించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న పిచ్చి భ్రమల్లో సీఎం తప్పులు చేస్తున్నారని, ఆ అపోహలు, భ్రమలు మాని బయటకు రావాలని సూచించారు. ఇప్పటికైనా అమరులను తెలంగాణ సమాజం గౌరవించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.
త్వరలోనే సీఎం నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపిన మాజీమంత్రి, లేదంటే బీఆర్ఎస్ పరంగా పోరాడతామని చెప్పారు. అమరజ్యోతిలోకి రేవంత్‌రెడ్డి అడుగు పెడితే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. రాజ్యాంగ నిర్మాతను ఘనంగా స్మరించుకోవాలని నిర్మించిన 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం వద్దకు కూడా ప్రజలను అనుమతించడం లేదని, జయంతి, వర్ధంతి రోజు కూడా నివాళులు అర్పించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం లేదని మండిపడ్డారు.
పోలీస్ పటేల్ కుమారుడిని అని, కేసీఆర్ నిర్మించారని అంబేద్కర్ విగ్రహం వద్దకు ప్రజలను అనుమతి ఇవ్వకపోవడం తగదని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సచివాలయం, అమరజ్యోతి మధ్య రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తెలంగాణ తల్లి ఆత్మ ఘోషిస్తుందని, మేధావులు ఆలోచించాలని కోరారు. పవిత్ర స్థలంలో ఒక పార్టీ నాయకుని విగ్రహం పెట్టడం ఏ మేరకు సబబు అని నిలదీశారు.
'స్వయంగా ముఖ్యమంత్రే ప్రతిపక్ష నేతలపై దాడులకు ఉసిగొల్పడం సిగ్గు చేటు' - BRS on CM Revanth Latest