BRS MLAs fire on CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి పురిగొల్పి మరీ పోలీసుల సాయంతో తన ఇంటిపైకి గాంధీని పంపారన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఓ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పంపించామని సీఎం చెప్పడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు. తనను ఎందుకు హత్య చేయాలని అనుకుంటున్నారో ముఖ్యమంత్రి చెప్పాలని, సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తనను హత్య చేయించేందుకు కుట్ర చేస్తున్నారని, ప్రజల కోసం చావడానికైనా సిద్ధమేనని వ్యాఖ్యానించారు. సోమవారం బీఆర్‌ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
దాడిపై సైబరాబాద్ సీపీ ఇంకా ఎందుకు స్పందించలేదని ఏసీపీ, సీఐపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. ఎవరి వీపు చింతపండు అయిందో గతంలో కొడంగల్, మహబూబ్‌నగర్‌లో చూడలేదా అని ఎద్దేవా చేశారు. పీసీసీ పదవి కోసం రేవంత్‌రెడ్డి తన ఇంటికొచ్చి కాళ్లు మొక్కారని కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి మోసం చేసినందునే కాంగ్రెస్ పార్టీని వీడానన్న ఆయన, రేవంత్‌రెడ్డిని సీఎం పదవి నుంచి దించే వరకు కేసీఆర్ నాయకత్వంలో పోరాడతానని తెలిపారు.
ఫోన్లు చేసి తానన్ని చంపుతామని బెదిరిస్తున్నారని, ఇంటెలిజెన్స్ అదనపు డీజీకి వివరాలు పంపినట్లు కౌశిక్‌రెడ్డి చెప్పారు. తనకు ఏదైనా జరిగితే బాధ్యత రేవంత్‌రెడ్డిదే అని అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు స్పందించాలని కోరారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చి 20 రోజులకు పైగా అయిందని, పేదల ఇండ్లు మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూలగొడుతున్నారని మండిపడ్డారు. శివానందరెడ్డి అనే బిల్డర్‌ను బెదిరించి ఇబ్రహీంబాగ్‌లోని ఓ విల్లాను రేవంత్‌రెడ్డి తన సోదరునికి ఇచ్చారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు.
'నిన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరు తెలంగాణ ప్రజలు మొత్తం చూశారు. స్వయంగా నేనే కౌశిక్‌రెడ్డిపై దాడి చేయమని పంపించా అని చెబుతున్నారు. స్వయంగా ఒక ముఖ్యమంత్రే ఒక ఎమ్మెల్యేపై దాడి చేయించడానికి ఇంటికి పంపించారంటే ఎంత పెద్ద సిగ్గుచేటు అని ప్రజలు గమనించాలి'-కౌశిక్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోతున్నారు : సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం తన దీనస్థితిని బయటపెట్టారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ ఆరోపించారు. హైకోర్టు తీర్పు తర్వాత పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సభాపతిని కోరామని, సమాధానం చెప్పలేక పాడి కౌశిక్‌రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీని ఉసికొల్పారని ఆక్షేపించారు.
తమ వాళ్లే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారని సీఎం రేవంత్ చెప్పారని, రాష్ట్రంలో ఆటవిక పాలన చేస్తున్నారని వివేకానందగౌడ్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోతున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై డీజీపీ, హోంశాఖ కార్యదర్శి స్పందించాలన్న ఆయన, త్వరలో డీజీపీ, హోంశాఖ కార్యదర్శి, గవర్నర్‌ను కలుస్తామని చెప్పారు. రాష్ట్రంలో న్యాయం జరగకపోతే రాష్ట్రపతిని కలిసి తెలంగాణలో పరిస్థితులను వివరిస్తామని వివేకానంద గౌడ్ తెలిపారు.
సీఎం రేవంత్‌కు ఏదో మానసిక వ్యాధి : సీఎం రేవంత్ రెడ్డికి ఏదో మానసిక వ్యాధి ఉందని ఓ మిత్రుడు చెప్పారని, ఒకరోజు ఒకలా, ఇంకో రోజు మరోలా మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి పదవిని, రేవంత్‌రెడ్డిని తాము గౌరవిస్తామని, చిన్న వయసులో సీఎం అయిన రేవంత్ తన స్థాయి నిలబెట్టుకోవాలని సూచించారు. సీఎం వ్యాఖ్యలు చూసి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అన్న బాధ కలుగుతోందని, ఇలాగే ఉంటే చదువుకున్న వారు ఎవరూ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపరని అన్నారు. కేసీఆర్ అంత ఉన్నతస్థాయికి రేవంత్‌రెడ్డి ఏ రోజు కూడా చేరలేరని సంజయ్ పేర్కొన్నారు.