Puvvada Ajay Kumar on Farmers Issues : కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం, అసమర్థ పాలన వల్ల ఈరోజు రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) అన్నారు. ఖమ్మం పట్టణంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కేసీఆర్ (KCR) అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లని తెలిపారు. కేసీఆర్ లేకపోవడంతో నాలుగు నెలల్లోనే, కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల తెలంగాణలో కరవు చాయలు కనిపిస్తున్నాయన్నారు.
ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాగార్జునసాగర్ నీళ్లను కేఆర్ఎంబీకి అప్పగించిందన్నారు. సాగర్ నీళ్లను ఆంధ్ర ప్రభుత్వం ఇటీవలే 12 టీఎంసీలు తరలించుకపోతే పట్టించుకున్న వాడే లేడన్నారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనబడటం లేదని, పంట చేతికొచ్చే దశలో పొలాలు ఎండిపోవడం బాధకరమన్నారు. సాగునీటి కోసం రైతులు బోర్లను వేసుకుని అప్పుల్లోకి జారుకుంటున్నారన్నారు. ఖమ్మంలో ప్రతిరోజూ వంద వరకు బోర్లు వేస్తున్నట్లు తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ నుంచి పాలేరు జలాశయానికి నీరు వదిలి, రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే ఈరోజు రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసీఆర్ అంటేనే కాలువలు చెరువులు రిజర్వాయర్లు. కేసీఆర్ లేకపోవడంతో నాలుగు నెలల్లోనే, కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల తెలంగాణలో కరవు చాయలు కనిపిస్తున్నాయి. రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనబడటం లేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నాగర్జుసాగర్ నుంచి పాలేరు జలాశయానికి నీరు వదిలి, రైతులకు సాగునీరు అందించాలి.- అజయ్ కుమార్, మాజీ మంత్రి