BRS Leaders Reaction on Kavitha Bail : ఎమ్మెల్సీ కవితకు బెయిల్ భారత రాష్ట్ర సమితిలో ఉత్సాహం నింపింది. పార్టీ నేతలు, శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. దిల్లీతో పాటు హైదరాబాద్లోని తెలంగాణ భవన్ బయట టపాసులు కాల్చి హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా దిల్లీలోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు.
కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం సంతోషకరమని, కొంత ఆలస్యమైనా న్యాయం, ధర్మం గెలిచిందని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్న ఆయన, కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుందనే నమ్మకం ఉందన్నారు. అన్యాయంగా కవితను జైలులో పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే కవిత బెయిల్‌పై కాంగ్రెస్ నేత మహేశ్ గౌడ్ దుర్మార్గంగా మాట్లాడారని మండిపడిన ప్రశాంత్ రెడ్డి, దిల్లీలో మకాం వేసి పైరవీలు చేస్తే బెయిల్ వచ్చిందంటూ సుప్రీంకోర్టు తీర్పును కించపరిచేలా మాట్లాడారన్నారు.
ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట - దిల్లీ మద్యం కేసులో బెయిల్ మంజూరు - BRS MLC KAVITHA GRANTED BAIL
సుప్రీంకోర్టు తీర్పునకు రాజకీయాలు ముడిపెట్టి మాట్లాడారని, న్యాయవ్యవస్థను కించపరిచేలా చేసిన మహేశ్ గౌడ్ వ్యాఖ్యలను న్యాయస్థానాలు గమనించాలని కోరారు. మహేశ్ గౌడ్ వ్యాఖ్యలపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామన్న ఆయన, చీకటి ఒప్పందాలు తమకు తెలియవన్నారు. ఈడీ, సీబీఐ ఎవరి కనుసన్నల్లో నడుస్తున్నాయో దేశమంతా తెలుసని వ్యాఖ్యానించారు. మహేశ్ గౌడ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా పోరాడుతామని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం సంతోషకరం. కొంత ఆలస్యమైనా న్యాయం, ధర్మం గెలిచింది. అన్యాయంగా కవితను జైలులో పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. కవిత బెయిల్‌పై కాంగ్రెస్ నేత మహేశ్ గౌడ్ దుర్మార్గంగా మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పునకు రాజకీయాలు ముడిపెట్టి మాట్లాడారు. న్యాయస్థానాలు మహేశ్ గౌడ్ వ్యాఖ్యలను గమనించాలి. మహేశ్ గౌడ్ వ్యాఖ్యలపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తాం. మహేశ్ గౌడ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా పోరాడతాం. - వేములప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి
కవితకు బెయిల్ రావడంపై కేటీఆర్, బండి మధ్య ట్వీట్ వార్ - 'కేంద్రమంత్రి ఆ వ్యాఖ్యలు చేయడం తగదు' - kavitha bail KTR and Bandi tweets