BRS MLAs fire on CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి పురిగొల్పి మరీ పోలీసుల సాయంతో తన ఇంటిపైకి గాంధీని పంపారన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఓ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పంపించామని సీఎం చెప్పడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు. తనను ఎందుకు హత్య చేయాలని అనుకుంటున్నారో ముఖ్యమంత్రి చెప్పాలని, సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తనను హత్య చేయించేందుకు కుట్ర చేస్తున్నారని, ప్రజల కోసం చావడానికైనా సిద్ధమేనని వ్యాఖ్యానించారు. సోమవారం బీఆర్‌ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
దాడిపై సైబరాబాద్ సీపీ ఇంకా ఎందుకు స్పందించలేదని ఏసీపీ, సీఐపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. ఎవరి వీపు చింతపండు అయిందో గతంలో కొడంగల్, మహబూబ్‌నగర్‌లో చూడలేదా అని ఎద్దేవా చేశారు. పీసీసీ పదవి కోసం రేవంత్‌రెడ్డి తన ఇంటికొచ్చి కాళ్లు మొక్కారని కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి మోసం చేసినందునే కాంగ్రెస్ పార్టీని వీడానన్న ఆయన, రేవంత్‌రెడ్డిని సీఎం పదవి నుంచి దించే వరకు కేసీఆర్ నాయకత్వంలో పోరాడతానని తెలిపారు.
ఫోన్లు చేసి తానన్ని చంపుతామని బెదిరిస్తున్నారని, ఇంటెలిజెన్స్ అదనపు డీజీకి వివరాలు పంపినట్లు కౌశిక్‌రెడ్డి చెప్పారు. తనకు ఏదైనా జరిగితే బాధ్యత రేవంత్‌రెడ్డిదే అని అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు స్పందించాలని కోరారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చి 20 రోజులకు పైగా అయిందని, పేదల ఇండ్లు మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూలగొడుతున్నారని మండిపడ్డారు. శివానందరెడ్డి అనే బిల్డర్‌ను బెదిరించి ఇబ్రహీంబాగ్‌లోని ఓ విల్లాను రేవంత్‌రెడ్డి తన సోదరునికి ఇచ్చారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు.
'నిన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరు తెలంగాణ ప్రజలు మొత్తం చూశారు. స్వయంగా నేనే కౌశిక్‌రెడ్డిపై దాడి చేయమని పంపించా అని చెబుతున్నారు. స్వయంగా ఒక ముఖ్యమంత్రే ఒక ఎమ్మెల్యేపై దాడి చేయించడానికి ఇంటికి పంపించారంటే ఎంత పెద్ద సిగ్గుచేటు అని ప్రజలు గమనించాలి'-కౌశిక్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే